ఈ దౌర్జన్యాలు, దాడులు శ్రీకారం మాత్రమే!

Monday, May 13, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల కదలికలను కనిపెడుతూ ఉండి, వారికి ఎడ్వాంటేజీ రాకుండా అడ్డుపడడం అనేది, అందుకు ప్రభుత్వ యంత్రాంగాలను వాడుకోవడం అనేది.. సాధారణంగా అధికార పార్టీల వారు చేస్తుంటారు. ఇదంతా కూడా రాజకీయంగా పైచేయి సాధించడానికి మాత్రమేనా అన్నట్టు సాగుతుంటుంది. కానీ.. ఇప్పుడు ఏపీలో పరిస్థితి వేరు. ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం మాత్రమే కాదు.. వారిని అడుగంటా తొక్కేయడమే లక్ష్యంగా చెలరేగుతున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ప్రజలకు అలాంటి అభిప్రాయమే కలిగిస్తున్నాయి. ఒకవైపు శ్రీకాకుంళం నుంచి సైకిలు యాత్ర చేసుకుంటూ చంద్రబాబుకు మద్దతుగా కుప్పం వెరకు వెళ్లదలచుకున్న తెలుగుదేశం కార్యకర్తలకు పుంగనూరు వద్ద ఘోరమైన అనుభవం ఎదురైంది. వారి సైకిళ్లకు కట్టుకున్న తెలుగుదేశం జెండాలను పీకి, కాళ్లతో తొక్కి.. వారు ధరించిన పసుపు బట్టలను విప్పించి.. వారిని బెదిరించి, అవమానించి పంపించారు. మరోవైపు అవనిగడ్డలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు పూనుకుంటే ఎమ్మెల్యే స్వయంగా వారి మీద తన అనుచరులతో కలిసి దాడి చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పనులు చేయలేదేమని అడిగిన వారు దౌర్జన్యానికి గురికావాల్సి వచ్చింది.

సహజంగానే ఈ దాడులను ఆయా  పార్టీ నాయకులు ఖండించారు. నారా భువనేశ్వరి పుంగనూరులో తమ కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాలను పిరికిచర్యగా అభివర్ణించారు. జనసేన నాయకులు కూడా ఈ దాడుల పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎక్కడ ఏ ఆందోళన కార్యక్రమం చేపట్టినా.. పాలకపక్షానికి సంబంధించిన వారు సహించే పరిస్థితిలో లేరు. అధికార పార్టీ మీద కించిత్ విమర్శకు దిగుతున్నారనే అభిప్రాయం కలిగితే.. చాలు దాడులకు దిగేస్తున్నారు. ఎన్నికలు మరో ఆరునెలల దూరంలో ఉండగా.. ఇప్పటికే రాజకీయ వాతావరణం విషపూరితంగా మారిపోయిందనే అభిప్రాయం కలుగుతోంది.

అధికార పార్టీ నాయకుల్లో ఉన్న భయం, అసహనం కారణంగా ఇలాంటి దాడులు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దాడులు ముందురోజుల్లో జరగబోయే పరిణామాలకు శ్రీకారం మాత్రమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతిచోటా రాజకీయ పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం కనుమరుగైపోయిందని, విపక్షాలకు చెందిన వారు గళమెత్తితే చాలు, వారి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది బదులు.. వారి మీద దాడులకు దిగడం అనేది సర్వసాధారణంగా మారబోతోందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles