తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరాచకమైన రీతిలో అరెస్టు చేసి జైలులో ఉంచిన నేపథ్యంలో నిరసన గళాలు మిన్నంటుతున్నాయి. దేశమంతా అనేకమంది రాజకీయ నాయకులు ఈ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలియజేయడం అంతా ఒక ఎత్తు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలు పెద్ద స్థాయిలో ఆందోళనలకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో జరుగుతున్న ప్రజల ఆందోళనలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. నిరసనలు తెలియజేయడానికి పూనుకుంటున్న వారి మీద పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కార్ ర్యాలీ రూపంలో వెళ్లి తమ నిరసన తెలియజేయడానికి పూనుకున్నప్పుడు ఏపీ పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. తెలంగాణ ఏపీ సరిహద్దులలో యుద్ధ వాతావరణం తలపించే లాగా పోలీసులను మోహరించి హైదరాబాదు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఒకప్పట్లో ‘‘హైదరాబాదు వెళ్లాలంటే వీసా కావాలా’’ అని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రశ్నించినట్లుగా.. ఆయన కొడుకు జగన్ పాలనలో ‘‘ఏపీ వెళ్లాలంటే వీసా కావాలేమో’’ అనిపించే రీతిలో పోలీసు తనిఖీలు ఆంక్షలు వెల్లువయ్యాయి.
అయినా సరే కొన్ని వందల కార్లలో ఐటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోలీసుల కళ్ళుగప్పి రాజమండ్రి చేరుకుని, అక్కడ ప్రదర్శన నిర్వహించారు. నారా భువనేశ్వరిని కలిసి తమ సంఘీభావం కూడా తెలియజేశారు. హైదరాబాదులో ఐటి పరిశ్రమ ఇవాళ అత్యుత్తమమైన స్థాయిలో పరిఢవిల్లుతున్నదంటే అందుకు చంద్రబాబు నాయుడు కృషే మూల కారణమని వారు పేర్కొన్నారు.
విశాఖపట్నంలో కూడా పోలీసుల ఆంక్షలు, ప్రతి బంధకాలు తప్పించుకుని, వారి కళ్ళుగప్పి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతం అయింది. తాము ర్యాలీ నిర్వహించడానికి ముందే అనుమతి కోరినప్పటికీ- పోలీసులు ఆ విజ్ఞాపనను పట్టించుకోలేదు. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా మెరుపు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు మేలుకొని వారిని అరెస్టు చేయడం వాహనాలు ఎక్కించి తరలించడం ద్వారా ర్యాలీని భగ్నం చేయడానికి శతవిధాల ప్రయత్నించారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితే ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు, తటస్తులు కూడా చంద్రబాబు అరెస్టు, నిర్బంధం పట్ల తమ నిరసనను వ్యక్తం చేయడానికి పూనుకుంటూ ఉండగా- వారికి ప్రతి చోట ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. పోలీసులు ఒక పట్టాన అనుమతులు ఇవ్వడం లేదు. చాలా చోట్ల పోలీసుల డేగ కళ్ళు కప్పి వారిని తప్పించుకుని ప్రజలు ఆందోళన చేయాల్సి వస్తోంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు పర్యవసానంగా ప్రజలలో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యతిరేకత పట్ల ప్రభుత్వం భయపడుతున్నందువల్లనే వాటిని అణిచివేయడానికి కుట్రలు పన్నుతున్నదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి!