వెంకన్న సొమ్ములు కాజేయడంపై కమలధ్వజం!

Monday, December 23, 2024

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి సొమ్ములను ఇతర అవసరాలకు వాడుకోవాలంటే సాధారణంగా ప్రభుత్వాలు కూడా జంకుతాయి. టీటీడీ డబ్బులు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ధార్మిక అవసరాలకు మాత్రమే వాడాలని కూడా ఒక ప్రకటిత నియమంలాగా పాటిస్తుంటారు. వందల వేల కోట్ల నిధులు పుష్కలంగా ఉండే టిటిడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు సొమ్ములు తీసుకోవడం గురించి గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి, ఆగాయి కూడా.  స్వామివారి డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వాలు జంకే పరిస్థితి గతంలో ఉండేది.  అయితే ప్రత్యక్షంగా డబ్బు తీసుకోవడం రూపంలో కాకపోయినప్పటికీ..  స్వామివారి సొత్తును వాడుకోవడం జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతుండడాన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలదీస్తోంది.

 తిరుపతి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత,  అప్పటికే తిరుచానూరు సమీపంలో టీటీడీ వారి నిర్మించి ఉన్న విశాలమైన అతిథి భవనాల సముదాయాన్ని ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయం కోసం అద్దెకు తీసుకున్నారు. నెలకు సుమారుగా 22 లక్షల రూపాయల అద్దె చెల్లించాలని ఒప్పందం.  అయితే భవనాన్ని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని..  ఈ రూపేనా కోట్ల రూపాయల టిటిడి సొమ్మును ప్రభుత్వం ఎగవేస్తోందని భారతీయ జనతా పార్టీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  భవనానికి ప్రభుత్వం చెల్లించాల్సిన అద్దె ఇప్పటిదాకా ఇవ్వకపోగా..అదనంగా ఆ భవనానికి వచ్చిన విద్యుత్ బిల్లును కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల వారే చెల్లించాలని లేఖ రాయడానికి ఆయన తప్పుపడుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి 100 కోట్ల రూపాయలకు పైగా నిధులను మళ్లించి ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడానికి ఒక వ్యూహం ప్రకారం కుట్ర జరుగుతున్నదని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల బ్యాంక్ అకౌంట్లో ఉన్న వందల కోట్ల రూపాయల సొమ్ములను ప్రభుత్వ అవసరాలకు రుణంగా తీసుకోవాలని ఆలోచన జగన్ సర్కారు చేస్తున్నట్లుగా రెండేళ్లకు పైగా ప్రచారంలో ఉంది.  రుణం రూపంలో తీసుకుంటారని,  బాండ్లు ఇచ్చి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటారని ఇలా రకరకాలుగా పుకార్లు వినిపించాయి.  అయితే దేవుడు సొమ్మును వాడుకోవడం అనే కొన్ని సెంటిమెంట్ల కారణంగా ప్రభుత్వం టిటిడి డబ్బు తీసుకోలేదని పలువురి అభిప్రాయం.  డబ్బు తీసుకోకపోవచ్చు గాక,  టీటీడీ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటూ వారికి అద్దె ఎగవేయడం,  విద్యుత్ బిల్లు కూడా వారే చెల్లించాలని అడగడం కూడా స్వామివారి సొమ్ము వాడుకోవడమే అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles