జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొరివితో తలకోక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది.ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ గ్యారెంటెడ్ పెన్షన్ పథకం జిపిఎస్ విషయంలో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. పాదయాత్ర సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు హామీ ఇచ్చిన విధంగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని ఉద్యోగులు ఎంతగా గోల చేస్తున్నప్పటికీ, వారి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా జగన్ క్యాబినెట్ జిపిఎస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలలోనే ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందే అవకాశం కూడా ఉంది. తమతో సుదీర్ఘకాలం చర్చలు జరిపినప్పటికీ, తమ అభ్యంతరాలు నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై.. ఉద్యోగ వర్గాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పాదయాత్ర చేస్తున్న సమయంలో.. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే వారం రోజుల్లోగా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఉద్యోగులు ఎంత ఉధృతమైన ఆందోళనలు చేసినప్పటికీ.. ప్రభుత్వం ఉక్కుపాదంతో వాటిని అణచివేసిందే తప్ప వారితో సానుకూలంగా చర్చలు జరపలేదు. చర్చల పేరుతో ప్రహసనం నడిపించిన ప్రతిసారి ప్రతిష్టంభన ఏర్పడిందే తప్ప అవి ముందుకు సాగలేదు.
ఉద్యోగుల ఇబ్బందులను కనీసం ప్రభుత్వం సావకాశంగా పట్టించుకోలేదు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తేవడం అనేది ప్రభుత్వానికి అసాధ్యం అయితే గనుక.. ఆ విషయాన్ని ఉద్యోగులకు అర్థమయ్యేలా చెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ కంటె.. సీపీఎస్ చాలా బెటర్ అని ఉద్యోగులు గోల పెడుతున్నారు. తమ డబ్బులు తీసుకుని, తమకే ఇవ్వడం ఏం న్యాయం అని అడుగుతున్నారు. కనీసం రిటైరైన తర్వాత.. ఈహెచ్ఎస్ వంటివి వర్తిస్తాయో లేదో అనే వారి సందేహాలను నివృత్తి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఆ రకంగా.. ప్రభుత్వం జీపీఎస్ బిల్లును కేబినెట్ ఆమోదించడం ద్వారా కొరివితో తల గోక్కున్నట్టుగా తయారైంది.