ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధిస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చేస్తున్న వంచన గురించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక రేంజిలో ధ్వజమెత్తారు.జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, అచ్చంగా లిక్కర్ వ్యాపారం ద్వారా వస్తున్న డబ్బుతోనే చేస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. ఒకవైపు చవకబారు మద్యానికి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ, మరోవైపు ఆ డబ్బుతోనే వారి జీవితాలకు సంక్షేమం అందిస్తున్నట్టుగా మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూపీఐ ద్వారా చెల్లింపులు లేని రెండే రెండు వ్యవహారాలు లిక్కర్ వ్యాపారం, ఇసుక వ్యాపారం మాత్రమే. ఈ రెండు వ్యాపారాలలోనూ అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు తొలి నుంచి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా మద్యం వ్యాపారం విషయంలో ప్రభుత్వం తీరు మీద నిశిత విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రమాదకరమైన రసాయనాలతో మద్యం తయారు చేస్తున్నారని, లీటర్ మద్యం 15 రూపాయలకు తయారుచేసి వందల రూపాయలకు విక్రయిస్తున్నారని.. ప్రజలకు అండగా ఉంటూ వారి బాగోగులు గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈ నాసిరకం మద్యం విక్రయాల ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందిని పురందేశ్వరి అన్నారు.
జగన్మోహన్ రెడ్డి సర్కారు అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల ద్వారా ప్రజలకు మంచి చేస్తున్నట్లుగా డప్పు కొట్టుకుంటూ ఉంటుందని.. నిజానికి రాష్ట్రంలోని ఆడపడుచుల పుస్తెలు తెగిపోయినా సరే, వారి జీవితాలు చిద్రమైపోయినా సరే, బతుకులు శిథిలమైపోయినా సరే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా.. నాసిరకం మద్యం విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతోనే ఆ మూడు సంక్షేమ పథకాలకు డబ్బులు ఏర్పాటు చేస్తున్నారని పురందేశ్వరి అన్నారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా 15 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 32 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని ఆమె వివరించారు. పైగా మద్యం విక్రయాల ద్వారా వసూలయ్యే సొమ్ము గరిష్టంగా వైసిపి నాయకులు జేబుల్లోకే వెళుతున్నదని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండగా.. దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర సారథ్యం స్వీకరించిన తర్వాత ఆయన ప్రభుత్వం తీరుతెన్నుల మీద ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారంలో ఉన్న లొసుగులను కూడా ఆమె ఇవాళ బట్టబయలు చేశారు. మరి విమర్శల పట్ల అధికార పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.