కొండా రాఘవరెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో అంతగా పాపులారిటీ లేని కీలక నాయకుడు. కాంగ్రెస్ రాజకీయాల్లో, ప్రధానంగా వైఎస్సార్ హయాంలో ఆయనకు ఎంతో సన్నిహితులుగా పేరున్న ఈ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు.. ఎమ్మెల్యేగా దిగే అవకాశం రాకపోవడం వల్ల తెరవెనుకనే ఉండిపోయారు తప్ప.. కీలకమైన వ్యక్తిగానే గుర్తింపు ఉంది. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టకముందునుంచి ఆమెకు మద్దతు ఇస్తూ, తొలిదశలో ప్రతి అడుగులోనూ ఆమె వెన్నంటి నిలిచిన వ్యక్తి కొండా రాఘవరెడ్డి. అలాంటి నాయకుడు ఇప్పుడు షర్మిల పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలన్ని షర్మిల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు.
అయితే, కొండా రాఘవరెడ్డి రాజీనామా తర్వాత ఆయన గురించి షర్మిల మాట్లాడిన మాటలు గమనిస్తే, చాలా చిత్రంగా అనిపిస్తాయి. ‘‘కొండా రాఘవరెడ్డి ఎప్పుడూ తమ పార్టీకోసం పనిచేయలేదని, పార్టీలో లేరని’’ షర్మిల చెప్పారు. ‘ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం ఏంటంటూ’ ఆమె ప్రశ్నించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఒక మూలస్తంభంలాగా నిలిచి, ఆమెకు ఎంతో తోడ్పాటు అందించిన వ్యక్తి, ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమాన నాయకుల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి గురించి షర్మిల ఈ తీరుగా మాట్లాడడం అనేది అందరినీ విస్మయపరుస్తోంది.
చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొండా రాఘవరెడ్డి, గతంలో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితులు. ఆయనకు వైఎస్ చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంద్రారెడ్డి మరణం తర్వాత సబితా ఇంద్రారెడ్డిని తెలుగుదేశం ఆహ్వానించింది. అప్పట్లో ఆమె ఆ పార్టీలోకి వెళ్లి ఉంటే గనుక.. చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండా రాఘవరెడ్డి ఉండేవారు. సబిత కాంగ్రెస్ ను వీడకపోవడంతో.. రాఘవరెడ్డి ఇక తెరమీదకు రానేలేదు. వైఎస్ మరణం తర్వాత.. ఆ కుటుంబానికి సన్నిహితుడైన రాఘవరెడ్డి , వైఎస్ జగన్మోహన రెడ్డికి కూడా అండగా ఉన్నారు. కొన్నాళ్లు భారాసలో కూడా పనిచేశారు. వైఎస్ జగన్ వైసీపీ పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాలకు పరిమితమైన తర్వాత.. స్తబ్ధంగా ఉండిపోయిన రాఘవరెడ్డి.. షర్మిల పార్టీ ఆలోచన చేయగానే అన్నీ తానై చూసుకున్నారు.
తొలిదశలో చేవెళ్ల తర్వాత.. నల్గొండ జిల్లాలో పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడం దగ్గరినుంచి పార్టీ ఆవిర్భావానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఖమ్మంలో షర్మిల సంకల్ప దీక్ష నిర్వహించినప్పుడు ఆయనే అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తూ కరోనా బారిన పడి సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. ప్రతిదశలోనూ ఆమె వెంట నిలిచారు. అలాంటి కొండా రాఘవరెడ్డి ఇప్పుడు… ‘‘వైఎస్సార్ తనయుడు జగన్ ను జైల్లో పెట్టించిన పార్టీలో షర్మిల చేరడం నచ్చకనే వైతెపాకు రాజీనామా చేస్తున్నట్టు’’ ప్రకటించారు. అయితే, అసలు కొండా రాఘవరెడ్డి తమ పార్టీలో ఎన్నడూ లేడు అన్నట్టుగా షర్మిల చులకన చేసి మాట్లాడడం ఇప్పుడు చాలా మందిని బాధిస్తోంది. పార్టీకి ఇంత చేసిన వ్యక్తినే టిస్యూ పేపర్ లాగా వాడి పారేస్తున్నప్పుడు.. షర్మిలను నమ్ముకున్న ఎవరికైనా ఇదే గతి అని ప్రజలు అనుకుంటున్నారు.