మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా దూకుడుగా మాట్లాడుతున్నారనే ఆరోపణల మీద తమ పార్టీ నాయకుడిపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ వేటు విధించింది. అలాగని ఆయన తన నోటిదూకుడు తగ్గించుకోలేదు. అలాగని వేరే పార్టీల్లోకి వెళ్లే ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ దగ్గరపడుతుండే సరికి.. హఠాత్తుగా ఆయన మీద సస్పెన్షన్ వేటు ఎత్తి వేయడానికి పార్టీ పూనుకుంటోంది. బిజెపిలోని ఆ ఎమ్మెల్యేనే రాజా సింగ్.
భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కొమ్ములు తిరిగిన నాయకులు ఎందరైనా ఉండవచ్చు గానీ.. 2018 ఎన్నికల్లో కేసీఆర్ హవా ముందు అందరూ పరాజయం పాలయ్యారు. గోషామహల్ స్టేడియం నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒక్కరే ఆ పార్టీ తరఫున గెలిచారు. ఆ రకంగా జాతీయ పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కూడా అయ్యారు. కిషన్ రెడ్డి వంటి ఉద్ధండులు కూడా ఓడిపోయిన ఆ ఎన్నికల్లో , తన విజయం ద్వారా.. తన తీరుకు ప్రజల్లో ఆమోదం ఉందని ఆయన నిరూపించుకున్నారు. అయితే హిందూత్వవాద అతివాద ప్రకటనలు చేస్తారనే పేరు రాజాసింగ్ కు ఉంది. ఆ విషయంలో ఆయన ఎన్నడూ జంకలేదు. అలాగే కేసీఆర్ సర్కారు మీద పోరాడడానికి కూడా వెనుకాడలేదు.
తనకు సెక్యూరిటీకోసం ఇచ్చిన పోలీసు వాహనం రిపేర్లు అవుతున్నదని దానిని వదిలిస మోటారు సైకిలు మీద తిరిగిన ట్రాక్ రికార్డు కూడా రాజాసింగ్ కు ఉంది. ముస్లిం వ్యతిరేకవ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలమీద ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. నిజానికి రాజాసింగ్ చాలా అలవాటుగా ప్రదర్శించే హిందూత్వ దూకుడుకు ఆయనను ఇతర పార్టీలు చేర్చుకునే అవకాశం కూడా లేదు. ముస్లిం మైనారిటీ ప్రేమను కనబరుస్తూ ఉండే కాంగ్రెస్ ఆయనను దగ్గరకు రానివ్వదు. గులాబీ దళం సంగతి సరేసరి. అలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ మాత్రం.. తాను కుదిరితే బిజెపి తరఫునే పోటీచేస్తానని లేకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని ప్రకటిస్తూ వచ్చారు.
ఇప్పుడు ఎన్నికల వేళ వచ్చింది. ఇప్పటిదాకా ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయలేదు. కాకపోతే.. తొందరలోనే సస్పెన్షన్ ఎత్తేస్తారని, గోషామహల్ నుంచి ఆయననే తిరిగి అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. నిజానికి రాజాసింగ్ కు వేరే పార్టీలోకి వెళ్లే మార్గం లేకపోవచ్చు గేనీ.. 2018 లో తమ పార్టీని ఆదరించిన ఒకే ఒక్క నియోజకవర్గంలో మరొకరిని పోటీకి దింపడానికి బిజెపికికూడా గత్యంతరం లేదు. ఈ రకంగా ఇరువైపులా అవసరం వల్లనే ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తున్రనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. రాజాసింగ్ సస్పెన్షన్ తొలగిపోతే.. రాష్ట్ర బిజెపిలో దూకుడైన మాటలకు మళ్లీ వింటుండవచ్చు.