తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన తొలి సమావేశం మంగళవారం నాడు జరిగింది. 119 స్థానాలకు గాను, 1006 దరఖాస్తులు అందగా, అందులోంచి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ.. తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం జరిగిన తీరు తెన్నుల సంగతి ఒక ప్రస్తావన అయితే.. ఈ సమావేశానికి కొందరు నాయకులు గైర్హాజరు కావడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీతారెడ్డి అనారోగ్యం వల్ల రాలేకపోతున్నట్టుగా ముందుగానే సమాచారం పంపారు. అయితే ఒకప్పటి స్టార్ క్రికెటర్ అజాహరుద్దీన్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరయ్యారు.
అజారుద్దీన్ పార్టీ మీద అలిగారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన అలక వహించారని అనుకోవడానికి తగిన కారణాలున్నాయి. గతంలో అజార్ పార్టీ తరఫున మొరాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగడానికి ఉత్సాహం చూపించారు గానీ.. టికెట్ దక్కలేదు. తర్వాత తాజాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నారు.
అయితే ఈ విషయం పార్టీలు ఇప్పటికే వివాదంతా మారింది. కొన్ని వారాల కిందట అజారుద్దీన్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తన అనుచరులతో కలిసి పర్యటించడం, ప్రజలతో భేటీ కావడానికి ప్రయత్నించడం.. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసేది తానేనని ప్రజలతో చెప్పడం వివాదాస్పదం అయింది. పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి వర్గీయులు అజార్ తన పర్యటన కార్యక్రమాల్లో ఉండగానే.. అక్కడకు చేరుకుని, ఆయనను అడ్డుకుని ఘర్షణకు దిగారు. పార్టీలోని పైస్థాయి నాయకులే తనను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా చెప్పారని అజారుద్దీన్ చెప్పినప్పటికీ.. వారు ఖాతరు చేయలేదు. అసలు విష్ణు వర్దన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రావడమే తప్పు అన్నట్టుగా తగాదా పడ్డారు. అజారుద్దీన్ వారి ప్రతిఘటన తాళలేక తన పర్యటన ను అర్థంతరంగా విరమించుకుని వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇటువైపు రాలేదు కూడా.
అయితే జూబ్లీ హిల్స్ టికెట్ విషయంలోనే అలకపూని ఆయన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఆయన జూబ్లీహిల్స్ స్థానానికి దరఖాస్తు కూడా సమర్పించుకున్నారు. కానీ అనుకూల సంకేతాలు లేవని, అందుకే అలకపూనారని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.