జగన్ మద్దిస్తం : ఖాతరు చేసే దిక్కే లేదు!

Friday, November 22, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఠా తగాదాలు ఉన్నాయి. పార్టీలోని నాయకులే గ్రూపులుగా విడిపోయి ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకునే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, వాలంటీర్లు ఫ్యాను గుర్తుకే ఓటేయిస్తారు.. అని నాయకులు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గానీ.. ఈ గ్రూపుల బెడద చిన్నదేం కాదు. అయితే మరీ ప్రమాదకరంగా ముదురుతున్న గ్రూపు వివాదాలను చక్కబెట్టడానికి పార్టీలోని కొందరు సీనియర్లకు జగన్ అధికారం కట్టబెట్టారు. అలాంటి వారు గ్రూపులీడర్లతో మాట్లాడుతూ.. సర్దుబాటుకోసం ప్రయత్నిస్తున్నారు గానీ.. ఒక్కచోటనైనా సత్ఫలితాలు సాధించినది లేదు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ఇరు వర్గాల నాయకులను పిలిపించినప్పుడు మాత్రం తాత్కాలిక సయోధ్య నెలకొంటోంది. కానీ తాజా పరిణామాన్ని గమనిస్తే.. జగన్ స్వయంగా పూనుకుని ఇద్దరు నాయకురాళ్ల మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నిస్తే.. చేతులు కలపాలని ప్రయత్నిస్తే.. వారు క్షణం కూడా ఉండలేక విదిలించుకున్నారు. ఈ సంఘటన నగరి నియోజకవర్గంలో జరిగింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. ఇంకా అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా కు, అసమ్మతి వర్గానికి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నించారు.

మంత్రి రోజా తన నియోజకవర్గంలో సొంత పార్టీనుంచి తీవ్రమైన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడి అసమ్మతి నాయకులకు జిల్లాలోని మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దాంతో వారెవ్వరూ ఆమె మంత్రి అయిన తర్వాత కూడా అస్సలు ఖాతరు చేయడంలేదు. అలాగే ఈసారి ఎన్నికల్లో మళ్లీ రోజాకు టికెట్ ఇస్తే గనుక.. ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే పట్టుదలతో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి ఆశీస్సులతో శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవిని కూడా దక్కించుకున్న ఇదే నియోజకవర్గానికి చెందిన చక్రపాణి రెడ్డి.. రోజాకు ఉన్న వైరివర్గంలో ఒక కీలక వ్యక్తి. ఆయన ఏకంగా జగన్ ను కలిసి.. రోజా మీద ఫిర్యాదులు చేసినట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అలాగే నగరి మునిపాలిటీ మాజీ ఛైర్మన్ కెజె శాంతి వర్గంతో కూడా రోజాకు శత్రుత్వమే ఉంది.

సోమవారంనాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా మరియు కెజె శాంతి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. వారి చేతులను తన చేతిలోకి తీసుకుని ఇద్దరి చేతులను కలిపేందుకు ప్రయత్నించారు. వారు మొరాయిస్తున్నా.. వారి చేతులను బలవంతంగా తీసుకుని ఒకరి చేతిలో మరొకరి చేయిని పెట్టి షేక్ హ్యాండ్ ఇప్పించడానికి ప్రయత్నించారు. అయితే ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా వారు వెంటనే చేతులు వెనక్కు లాగేసుకున్నారు. షేక్ హ్యాండ్ కు కూడా వారు సుముఖంగా లేరు. అలాంటిది కలిసి పార్టీ విజయం కోసం ఎలా పనిచేయగలరని జనం నోళ్లు నొక్కుకున్నారు. స్వయంగా సీఎం సయోధ్య కుదిర్చడానికి  ప్రయత్నించినా.. వారు పట్టించుకోకపోవడం చూస్తే ఆయనకు పార్టీ నాయకుల మీద ఎంత పట్టు ఉన్నదో అర్థమవుతోందని.. ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles