ప్రత్యర్థులను చికాకు పెట్టడానికి, వారి మీదకి కదనోత్సాహం ప్రదర్శించడానికి కొన్ని సందర్భాల్లో నాయకులు తమ చేతికి మట్టి అంటకుండా, తమ పార్టీ మీదకు ఎలాంటి నిందలు రాకుండా.. కిరాయి మూకలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఊరూ పేరూ లేని ఇతర పార్టీల నాయకులు, లేదా, ప్రజలకు అస్సలు తెలియని పార్టీలను తమ ప్రత్యర్థుల మీదికి ఉసిగొల్పుతుంటారు. వారికి తాయిలాలే ఇస్తారో.. వారు ఆశపడే బిస్కెట్ లనే విసురుతారో తెలియదు.
అయితే ప్రస్తుతం తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టించే ఒక ప్రచారం సాగించడానికి ఒక పార్టీ ముందుకు వచ్చింది. ఏకంగా తెలుగుదేశం పార్టీ కి గల గుర్తింపునే రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. కొన్ని రోజుల కిందట కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే తరహా డిమాండ్లను వినిపించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో.. మరో పార్టీ అదే డిమాండ్ తో ఏకంగా ఈసీకి లేఖ రాయడం గమనిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ లేదా జగన్ ప్రేరేపణతోనే ఆ పార్టీ తెలుగుదేశం మీద ఫిర్యాదు చేసి ఉండవచ్చునని అనుకుంటున్నారు. వైసీపీ ప్రలోభాలతోనే ఇలా జరిగి ఉంటుందని కూడా అనుకుంటున్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏదో ఒక స్థాయి ప్రలోభాలకు సోదిలో లేని రాజకీయ పార్టీలు ఇలాంటి పనులు చేస్తుంటాయి. అయితే జగన్ ప్రలోభాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని చిన్నా చితకా పార్టీలేవీ లొంగినట్లుగా లేదని, అందుకే తెలంగాణలోని పార్టీ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించారని ప్రజలు అనుకుంటున్నారు.
తాజాగా చంద్రబాబునాయుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు గనుక, ఆయన ఆ రూపంలో ప్రజల చావులకు కారణమవుతున్నారు గనుక, తన కార్యకర్తలతో పోలీసుల మీదనే దాడి చేయించారు గనుక.. ఆయన పార్టీ గుర్తింపును రద్దు చేయాలని నవసమాజ్ పార్టీ అనే రిజిస్టర్డు పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి ఈసీకి లేఖ రాశారు. ఇది తెలంగాణకు చెందిన నపార్టీ. ఈ పార్టీ రిజిస్టర్డు కార్యాలయం రంగారెడ్డి జిల్లాలోని మన్సూరాబాద్ లో ఉంటుంది. ఆయన రాసిన లేఖలో పేర్కొన్న సంఘటనల ఉదాహరణలన్నీ కూడా ఏపీలో జరిగినవే. తెలంగాణకు సంబంధం ఉన్నవి కాదు.
చంద్రబాబు మీద ఈసీకి పితూరీ పెట్టడానికి.. జగన్ కోటరీ ఏపీలో ఒక్కరినైనా దొరకబుచ్చుకోలేకపోయిందా? లేదా, ఏపీలో ట్రై చేసినా కూడా.. ప్రలోభాలు పెట్టినా కూడా, అసంబద్ధంగా అనిపించే ఆ పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.