వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు తమ పార్టీని సన్నద్ధం చేస్తున్న తీరు చాలా చిత్రంగానూ వినూత్నంగానూ ఉంటోంది. వారివన్నీ గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనుసరించి ఉండని ఆలోచనలు, అసమానమైన కుట్రలు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించడం కోసం- అనే ఒక మాయ మాట ద్వారా.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి ద్వారా అనేక సర్వేలను నిర్వహిస్తున్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీరు ఉండడం మూలాన, ఆ వాలంటీరు వైఎస్సార్ పార్టీ కార్యకర్తలే అయి ఉండడం మూలాన.. ప్రజల వివరాలు, డేటా సేకరించడం చాలా సులువు అవుతోంది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి ఓటు వేసే కుటుంబాలు ఏవేవి ఉన్నాయో.. వారిని ప్రత్యేకంగా ఏరి.. వారి ఓట్లను తొలగింపజేసేందుకు వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతున్నదని అందరూ అంటున్నారు. అలాగే దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారనే ఫిర్యాదులుకూడా మితి మీరి వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించడం మీద, తెలుగుదేశం ఓట్లను తొలగించడం మీద సుదీర్ఘకాలంగా గళమెత్తుతోంది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, గవర్నరుకు ఫిర్యాదులు చేశారు కూడా. ఇలాంటి పోకడలపై మీడియాలో పలుమార్లు సాక్ష్యాలసహా కథనాలు కూడా వచ్చాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదులు వస్తే.. అన్ని పార్టీల ఏజంట్ల సమక్షంలోనే వాటిని క్రాస్ చెక్ చేసి నిర్ధారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపించింది కూడా.
ఇప్పుడు చంద్రబాబునాయుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేయడానికి వెళుతున్నప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా అతిగా కంగారు పడుతోంది. నిజానికి సీఈసీతో చంద్రబాబునాయుడు భేటీ అయిన తర్వాత.. వైసీపీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఉంది. వారు కూడా దొంగఓట్ల వ్యవహారం మీదనే ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే.. ఈలోగా దొంగ ఓట్లు అన్నింటికీ చంద్రబాబునాయుడే కారణమని అతిగా స్పందిస్తున్నారు.
తెలుగుదేశం పాలన హయాంలో రాష్ట్రంలో 60 లక్షల దొంగఓట్లు నమోదు చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే అన్యాపదేశంగా ఇప్పుడు అవన్నీ తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోదలచుకుంటున్నారా? లేదా, వారు 60 లక్షలు చేశారు గనుక.. మేం కోటి దొంగ ఓట్లు నమోదు చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నాం అని సంకేతాలు ఇవ్వదలచుకున్నారా అర్థం కావడం లేదు. వారు చేస్తున్న ఆరోపణలు మాత్రం ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే తరహాలోనే ఉన్నాయి. తెదేపా హయాంలో అన్ని దొంగఓట్లు నమోదు కావడమే నిజమైతే.. అప్పట్లో వైసీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలు నాయకులు ఏం చేస్తున్నట్టు? కనీసం ఎన్నికల జాబితాలను గమనిస్తూ ఉండాలనే స్పృహ కూడా లేకుండా వారు రాజకీయం చేస్తూ వచ్చారా? అనేది సామాన్యుల సందేహం.
ఏది ఏమైనప్పటికీ, ఎటూ ఎన్నికలకు ఇంకా అనేక నెలల వ్యవధి ఉంది. ఏపీలో ఎన్నికల జాబితాలను సంస్కరించడానికి పూర్తిస్థాయి జరగాలనే డిమాండ్ మాత్రం ఊపందుకుంటోంది.