ఖమ్మంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ గుర్తుందా? ఆ సభలో రాహుల్ గాంధీ వీరావేశంతో ప్రసంగించారు. కేసీఆర్- భారాస అనేవి భారతీయ జనతా పార్టీకి బిటీమ్ మాత్రమే అని ఆరోపణలు చేశారు. వారు బిటీమ్ గనుకనే.. తాను వారిని దూరం పెడుతున్నానని అన్నారు. కేసీఆర్ ను ఆహ్వానించేట్లయితే గనుక.. భాజపాయేతర పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేయదలచుకున్న కూటమి భేటీలకు తాను హాజరు కానని, ఆ కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ముందుగానే హెచ్చరించారు. మొత్తానికి ఆ మాటల ద్వారా.. తాను విపక్ష కూటమినుంచి కేసీఆర్ ను వెలివేశాననే సంకేతాలు ఇచ్చారు.
తీరా మల్లికార్జున ఖర్గే కూడా చేవెళ్లలో బహిరంగసభ నిర్వహించడానికి ప్రత్యేకంగా తరలివచ్చారు. సహజంగానే కేసీఆర్ ను నిందించడం ఆయన ప్రయారిటీ. ఉత్తినే నిందిస్తే సరిపోదు. సదరు కేసీఆర్ కు మోడీతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా ప్రచారం చేయడం వారి అవసరం. భారాస అనేది భాజపా కు బీటీమ్ అని ప్రజల్ని నమ్మించగలిగితేనే తప్ప.. తమకు తెలంగాణలో ఈ ఎన్నికల్లో ఠికానా ఉండదని వారికి భయం! ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మల్లి కార్జున ఖర్గే మరో రకమైన వాదనను తెరీదికి తెచ్చారు. కేసీఆర్ , ప్రధాని మోడీతో ఆల్రెడీ కుమ్మక్కు అయిపోయారు. అందుచేతనే.. మోడీని ఓడించడానికి విపక్షాలు అన్నీ కలిసి భేటీలు నిర్వహిస్తే.. ఆ భేటీలకు కేసీఆర్ రాలేదు అని ఆయన సెలవిచ్చారు.
కాంగ్రెస్ వంటి దేశంలో ఒకానొక అతిపెద్ద పార్టీకి.. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అదే పార్టీకి.. ఎలాంటి కిరీటమూ లేని యజమాని, సర్వాధికారి రాహుల్ గాంధీ. ఈ ఇద్దరు నాయకులు ఇంతగా పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడడం అనేది చాలా చిత్రమైన సంగతి. కేవలం బురద చల్లడం మాత్రమే తప్ప తమ మాటల్లో ఔచిత్యం ఉండాలని వీరు ఏమాత్రం కోరుకుంటున్నట్టుగా లేదని ఈ వ్యవహారం చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది.
ప్రజలు గుర్తించలేని అబద్ధాలు చెబితే రాజకీయాల్లో ఎక్కువ కాలం మనగలగడం సాధ్యమవుతుంది. కేవలం ఒకటి రెండు నెలల గ్యాప్ లోనే ఇలా అగ్రనాయకులు మరీ ఇంత చిల్లరగా అబద్ధాలు చెబితే ఏం అనుకోవాలి. ఏదేమైనా సరే.. ఈ ఇద్దరు నాయకుల్లో ఒకరు చెప్పినది పచ్చి అబద్ధం! మరి ఇంతగా బహిరంగ వేదికల మీద పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులను ప్రజలు నమ్మితే.. వారికి ఏ రకంగా న్యాయం చేస్తారు?