చంద్రబాబు పూనుకుంటే బలపడడం గ్యారంటీ!

Wednesday, December 18, 2024

తెలంగాణ తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు కూడా పార్టీ మీద ఫోకస్ తగ్గించారు. పార్టీకి సారధిగా ఉన్న ఎల్.రమణ కూడా భారాసలో చేరిన తర్వాత.. తెలుగుదేశం వైభవం మసకబారిపోయింది. అయితే అనూహ్యంగా, కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత.. తెలుగుదేశానికి ఒక్కసారిగా గేర్ మారింది. ఆయన పార్టీని ఉత్సాహంగా ముందుకు నడిపించడానికి తన వంతు పాటుపడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత.. చంద్రబాబు ఖమ్మంలో ఒక భారీ బహిరంగసభ కూడా నిర్వహించడం గమనార్హం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు పూనుకుని.. కాస్త దృష్టి పెట్టినట్టయితే.. తెలుగుదేశానికి కాస్త మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు నెగ్గి సభలో ప్రవేశించడం కూడా సాధ్యమవుతుందని పలువురు భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత.. తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కేసీఆర్.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం మీద దృష్టి పెట్టారు. ఖాళీ చేసేశారు కూడా. తెలుగుదేశం కీలక నాయకులందరూ ఇవాళ గులాబీ భారాసలోనే ఉన్నారు. వారిలో కులాలు, ఆర్థిక నేపథ్యాలు, విధేయత ప్రాతిపదికలుగా కేసీఆర్ కొందరికి మంచి అవకాశాలే కల్పించారు. కానీ.. ఒకసారి తమ పార్టీలో చేరిన తర్వాత.. ఇక వారికి వేరే గతి లేదు అనే ఉద్దేశంతో చాలా మందిని పక్కన పెట్టారు. అలాంటి వారు ఇప్పుడు మింగలేక కక్కలేక అసంతృప్తితో వేగిపోతున్నారు. కొందరు మాత్రం.. ఈ కేసీఆర్ ప్రాపకంలో తమకు రాజకీయ జీవితం ఎప్పటికీ ఉండదు, ఆయన ఉండనివ్వరు అని అర్థం చేసుకుని తమ దారి తాము చూసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

ఇలాంటి సమయంలోనే చంద్రబాబునాయుడు పూనిక వహించి.. తెలంగాణ తెదేపా మీద కాస్త దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు.. ప్రస్తుతం భారాసనుంచి బయటకు వచ్చారు. కొత్తగా ఏ పార్టీలో చేరేది ఆయన ఇంకా ప్రకటించలేదు. అలాగే తెదేపా మాజీ మంత్రి క్రిష్ణయాదవ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. దళిత వర్గం నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వంటి వారు కూడా.. కేసీఆర్ తమను తొక్కేస్తున్నారనే అసంతృప్తితో వేగిపోతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు తాను వారిని సంప్రదించి.. తిరిగి తెలుగుదేశంలోకి తీసుకురాగలిగితే.. కనీసం కొన్ని సీట్లు చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి కాకపోయినా.. నెమ్మది నెమ్మదిగా తెలంగాణలో కూడా పార్టీ గౌరవప్రదమైనన్ని సీట్లు గెలవగలిగే స్థితికి చేరుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నరు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles