‘దోచుకో.. దాచుకో.. పంచుకో..’ అనేది తెలుగుదేశం పార్టీ విధానం అని, వారు అధికారంలో ఉన్నంత కాలం ఇదే సూత్రాన్ని అనుసరించే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే అంటూ ఉంటారు. ప్రతి సభలోను ఇలాంటి నిందలు వేస్తూ ఉంటారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రజలకు ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది. ఎవరు దోచుకుంటున్నారో ఎవరు పంచుకుంటున్నారో కూడా విపులంగా అర్థమవుతుంది.
బొత్స సత్యనారాయణ సోదరులకు చెందిన కంపెనీకి ప్రభుత్వం కారు చవకంగా భూములు కట్టబెట్టింది. విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఏపీఐఐసీ పరిధిలోని గ్రోత్ సెంటర్ పారిశ్రామిక వాడలో ఎకరం భూమి ధర ఏపీఐఐసీ ప్రకారం 82 లక్షలకు పైచిలుకే. ఇదే ప్రాంతంలో ఏపీఐఐసీకి వెలుపల ఉన్న భూముల విలువ ఒక ఎకరం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు. పారిశ్రామిక వాడలో తక్కువ ధర నిర్ణయించడం అంటేనే పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించినట్లు లెక్క. పరిశ్రమలు వస్తే తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వాటి ద్వారా యోదకు లభించే కోరుతుందని ఒక నమ్మకం. అలాంటి నేపథ్యంలో అసలే మార్కెట్ ధర కంటే తక్కువ ధర నిర్ణయించిన ఏపీఐఐసీ భూములను మరింత కారు చవకగా మంత్రికి చెందిన కంపెనీలకు కట్టబెట్టారు. ఒక ఎకరం కేవలం 10 లక్షల రూపాయల వంతున బొత్స సోదరులకు చెందిన సత్య బయోఫ్యూయెల్స్ కంపెనీకి ధారా దత్తం చేయడం విశేషం. ఈ కేటాయింపుల వలన ప్రభుత్వానికి సుమారుగా 21 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. మొత్తం 30 ఎకరాల భూమిని బొత్స బంధువులు కారుచౌకగా కొట్టేశారు.
అయిన వారికి లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేస్తుందో గమనిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రాయితీ ధరమీద ఆ భూముల కోసం బొత్స బంధువుల కంపెనీ జూన్ 21న దరఖాస్తు చేసుకుంది. అయిదు రోజుల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం దాన్ని పరిశ్రమల శాఖకు పంపేసింది. జులై 10న వారికి భూమి ఇవ్వవచ్చునంటూ సిఫారసు తయారైంది. జులై11న సీఎం సమక్షంలో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. జులై 27న జీవో కూడా వచ్చేసింది. కేవలం అయిదువారాల్లో ఈ వ్యవహారం మొత్తం పూర్తయిపోయింది. అది బొత్సకు సంబంధించిన కంపెనీ కాకుండా.. మరెవ్వరిదైనా అయితే ఇంతే వేగంగా అయిదు వారాల్లో మొత్తం భూ కేటాయింపులు కూడా జరిగిపోతూ.. ఆ వెంటనే యూనిట్ గ్రౌండింగ్ అయ్యేలా ప్రభుత్వం శ్రద్ధ కూడా తీసుకుంటే వారిని ఎంతో అభినందించాలి. కానీ.. ఈ జీవో ద్వారా.. అయినవారికి ప్రభుత్వ భూములను దోచిపెట్టడంలో తాము ఎంత ఉదారంగా వ్యవహరిస్తామో, ఎంత వేగంగా పనిచేస్తామో పాలకపక్షం నిరూపించుకుందని ప్రజలు ఈ వైఖరిని తప్పుపడుతున్నారు.