‘అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో..’ అనేది సామెత. ఆ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళికి అచ్చంగా సరిపోయేలా కనిపిస్తోంది. పార్టీ నిర్వహణ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని రూల్సు పెట్టుకున్నారు. పార్టీలో ఎవ్వరు ఎలాంటి వినతులతో తన వద్దకు వచ్చినా ఆయన ఆ రూల్సు గుర్తుచేస్తారు. అయితే ఆ రూల్సు అన్నీ ఇతరులకోసమేనని, జగన్ మోహన్ రెడ్డికి ప్రీతిపాత్రులు, అయినవారికి అవి వర్తించవని ఆయన చాలా స్పష్టంగా నిరూపిస్తున్నారు. ఇప్పటికే భూమనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా పరోక్షంగా సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి జగన్, తాజాగా తుడా ఛైర్మన్ పదవిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కట్టబెట్టడం ద్వారా తేల్చిచెప్పేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలా మందికి మళ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీచేయాలనే ఉద్దేశం లేదు. తమ బదులుగా తమ వారసులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారసరళితో పొసగడం లేదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. జగన్ పోకడలు, ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వైనం, ఎవ్వరికీ నాయకుడిని కలిసే అవకాశం దక్కకపోవడం, ఆయన ఒంటెత్తు పోకడలు ఇలాంటి చాలా కారణాల వలన.. సిటింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు ఇక పక్కకు తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు పుకార్లున్నాయి. అయితే.. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. విజయావకాశాలను దూరం చేసుకోకుండా ఉండడానికి, తమ వారసులను ప్రవేశపెట్టడానికి దీనిని మంచి తరుణంగా భావిస్తున్న వారు కూడా ఉన్నారు. కొద్దిమందిలో.. 2024 ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టం అని.. గౌరవంగా తాము పక్కకు తప్పుకుని వారసుల్ని బరిలోకి దించితే.. ఒకసారి ఓడిపోయినా సరే.. వారికి పునాది ఏర్పడుతుందని భావిస్తున్న వారు కూడా ఉన్నారు.
జగన్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాల్లో.. వారసుల ఎంట్రీ గురించి పలువురు ప్రస్తావించిన సందర్భాలుకూడా ఉన్నాయి. అయితే జగన్ ప్రతిసారీ ఆ వినతులను ఖండించారు. ఈ ఎన్నికల వరకు ఇదే టీమ్ తో తాను మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్టుగా ఆయన తెగేసి చెప్పారు. పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంటి వారి వారసుల ప్రయత్నాలను కూడా ఆయన తిప్పికొట్టారు.
అయితే, ముందే చెప్పినట్టు అయినవారికి ఆకుల్లో అన్నచందంగా.. తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేల విషయంలో జగన్ వ్యవహరించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం ద్వారా.. ఆయన కొడుకు, ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్టు జగన్ సంకేతాలు ఇచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పార్టీ కేంద్రకార్యాలయం లో వాడుకునేందుకు తీసుకుంటాం అని ఆల్రెడీ ప్రకటించిన జగన్.. ఆయన కొడుకు మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. మొన్నటిదాకా ఆ పదవిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డే ఉన్నారు. గడపగడపకు కార్యక్రమంలో కూడా తండ్రి బదులుగా మోహిత్ రెడ్డే నియోజకవర్గమంతా తిరిగారు. నియోజకవర్గంలో పాదయాత్ర కూడా నిర్వహించారు. తండ్రి వారసత్వంలాగా ప్రస్తుతం తుడా ఛైర్మన్ పదవిలోకి వచ్చారు.. అక్కడినుంచి.. ఎమ్మెల్యే టికెట్ పొందుతారని స్పష్టమవుతోంది. అయితే.. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న టీమ్ వెళ్లాలని, వారసుల సంగతి ఆ తర్వాతి ఎన్నికల్లో మాత్రమేనని, ఆదర్శాలు వల్లించిన జగన్.. తనకు కావాల్సిన వారి విషయంలో వాటిని తుంగలో తొక్కారని పార్టీ నాయకులే అంటున్నారు.