తెలంగాణ కాంగ్రెసు పార్టీకి వరుస శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ.. అత్యుత్సాహం, ప్రగల్భాలు తగ్గించుకుని.. వాస్తవిక దృక్పథంతో ఎన్నికల సమరానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టి.. కాంగ్రెసులో చేరడం అనేది చాలా కీలక పరిణామం. తెరాసకు వ్యతిరేకంగా పోరాడి, కేసీఆర్ ను ఓడించగల పార్టీ ఏమిటా? అంటే.. అదే కాంగ్రెస్ మాత్రమే అని ప్రజలు నమ్మే వాతావరణాన్ని ఇలాంటి చేరికలు కలిగిస్తున్నాయి.
చంద్రశేఖర్ అంటే.. వికారాబాద్ నుంచి ఏకంగా అయిదుసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. తెలుగుదేశం హాయంలో మంత్రిగా చేసిన చరిత్ర కూడా ఉంది. వికారాబాద్ నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి ఓటమి పాలైన తర్వాత.. ఆయన గతంలో కాంగ్రెసులో చేరారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బరిలోకి దిగి భంగపడ్డారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకత్వం విషయంలో.. వ్యూహాల విషయంలో అనేక ప్రయోగాలు చేస్తున్నది గానీ.. చంద్రశేఖర్ వంటి వలసవచ్చిన సీనియర్ నాయకులను వాడుకునే విషయంలో తేలికగా వ్యవహరించింది.
చేరికల కమిటీ సారథిగా ఈటల రాజేందర్.. ఇతర పార్టీల నుంచి కొత్తగా నాయకులను కమలదళంలోకి వలసలు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. రాష్ట్ర నాయకత్వంతో పొసగక ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తీరా.. రాజీనామా నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత.. ఏదో ఆయనను దువ్వడానికి అన్నట్టుగా ఈటల వెళ్లి ప్రయోజనం లేని మంతనాలు సాగించారు.
తాజాగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన చంద్రశేఖర్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని, ఎక్కడనుంచి పోటీచేయమంటే అక్కడినుంచి పోటీచేస్తానని ఆయన వెల్లడించారు. టికెట్ ఇవ్వకపోయినా కూడా పార్టీ బాధ్యతల్లో ఉంటానంటూ చంద్రశేఖర్ వెల్లడించడం కీలకం. ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తున్నాయి. తమ పార్టీ మరింతగా బలపడుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
మరింతగా బలపడుతున్న తెలంగాణ కాంగ్రెస్!
Friday, November 15, 2024