కాషాయ హైకమాండ్ కంటే ఎక్కువ జీవీఎల్!

Thursday, January 2, 2025

జాతీయ పార్టీల స్థానిక నాయకులు- తమ తమ పార్టీలు అనుసరించే ఎన్నికల వ్యూహాలు, పెట్టుకునే పొత్తు బంధాల గురించి పెదవి విప్పి మాట్లాడరు. అలాంటి నిర్ణయాలను తమ పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుందని చెబుతూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పార్టీ హై కమాండ్ కంటే తాను పై కమాండ్ అనుకునే జీవీఎల్ నరసింహారావు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే పొత్తుల గురించి పూర్తి అధికారికంగా మాట్లాడుతున్నారు. ఏపీలో జనసేనతో మాత్రమే తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని మరే ఇతర పార్టీతో కూడా కొత్త పొత్తులు ఉండబోవని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ఇది పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకం అనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోయేది లేదని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ భాజపాను కూడా పొత్తుల్లోకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా అమిత్ షా తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో ఈ విషయంలో స్పష్టంగా చర్చలు జరిపారు. అయితే ఎవ్వరూ ఇప్పటిదాకా బయటపడలేదు. రాష్ట్ర బిజెపి నాయకులను కదిలించిన ప్రతిసారి పొత్తుల విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ పోతామని పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా జీవీఎల్ మాత్రం పొత్తులపై తేల్చేసినట్టుగా వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళితేనే తమ పార్టీకి కొంత లాభం ఉంటుందని, చట్టసభల్లోకి ప్రవేశించడం సాధ్యమవుతుందని, పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి కుదురుతుందని కొందరు బిజెపి నేతలు భావిస్తున్నారు. అలాంటి వారికి జీవీఎల్ మాటలు కంటగింపుగా ఉన్నాయి. జీవీఎల్ తన స్థాయిని మరిచి మాట్లాడారని వారు విమర్శిస్తున్నారు. రాష్ట్ర పార్టీ కొత్తసారథి దగ్గుబాటి పురందేశ్వరి సహా ప్రతి ఒక్కరూ కూడా పొత్తుల విషయంలో చాలా సంయమనంతో కూడిన మాటలు మాట్లాడుతుండగా జీవీఎల్ ఇలా దూకుడుగా ప్రకటించడం అనేది పార్టీని ఇరుకున పెడుతున్నదని అనేక మంది విమర్శిస్తున్నారు.

రాష్ట్ర పార్టీ కొత్త సారధి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇప్పటిదాకా పొత్తుల విషయంలో ఒక్క మాట కూడా బయటకు చెప్పలేదు. అలాంటిది జీవీఎల్ నరసింహారావు ఈ మాటలు మాట్లాడడం పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించినట్లే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు పార్టీ నాయకత్వం- జీవీఎల్ నరసింహారావు తన సొంత అభిప్రాయాన్ని వెల్లడించారని ప్రకటించి, సందిగ్ధతను కంటిన్యూ చేస్తుందా..? లేదా, పార్టీ నిర్ణయం కూడా అదే అంటూ ధృవీకరిస్తారా అనేది వేచి చూడాలి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles