వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఒక గంటపాటు ప్రత్యేకంగా సమావేశం అయిన ఆమె.. త్వరలోనే పార్టీలో చేరిక ఉంటుందని ప్రకటించారు. తనకు కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ ఎంతో అండగా ఉన్నారని కూడా అన్నారు. చంద్రబాబునాయుడు- జగన్ పరిపాలనల మధ్య తేడాను తెలుగు ప్రజలు గమనిస్తున్నారని సెలవిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నట్టుగా శ్రీదేవి చెప్పుకొచ్చారు.
మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలలో చిట్టచివరి వ్యక్తిగా ఉండవిల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశంలోకి వచ్చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలోనే ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. అసలు ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందని, ఏ పనీ చేయకుండా ప్రజల వద్దకు వెళ్లడం ఎలా కుదురుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి దూరం అయ్యారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి శాంక్షన్ చేసిన పనులకు కూడా పైసా నిధులు రావడం లేదని ఆగ్రహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని పార్టీ దూరం పెట్టింది. ఇతర కారణాలతో మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా దూరం అయ్యారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు పార్టీకి దూరంగా మెలుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కంటె వారి అభ్యర్థి అనురాధకు నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఆ నాలుగో ఓటు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిది అని భావించి.. పార్టీ ఈ నలుగురి మీద వేటు వేసింది. అయితే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలూ అధికారికంగా తెలుగుదేశంలో చేరకపోయినప్పటికీ.. లోకేష్ తమ జిల్లాలో పాదయాత్రం సందర్భంగా పార్టీతో అనుబంధాన్ని సుస్థిరం చేసుకున్నారు. మిగిలిన ఒక్క ఎమ్మెల్యే శ్రీదేవి తాజాగా ఆ పర్వం పూర్తిచేశారు.
నిజానికి ఇంకా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడే వారు బయటపడకుండా.. ఎన్నికల వేళకు పార్టీలో చేరుతారని సమాచారం. తాము వేటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలూ మళ్లీ గెలిచే అవకాశం లేదనే మాటలతో మైండ్ గేమ్ ద్వారా వైసీపీ ఆడుకుంటున్నది గానీ.. ఎవరి నిజమైన బలం ఎంత అనేది ఎన్నికల్లోనే తేలుతుంది.
చివరగా శ్రీదేవి.. ఆ నలుగురూ వచ్చేసినట్టే!
Friday, November 15, 2024