షర్మిల సిగ్నల్స్ క్లియర్.. రిజల్ట్ ఉంటుందా?

Friday, December 20, 2024

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల సొంతంగా పోరాడే క్రమంలో విసిగి వేసారి పోయినట్లుగా ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తానని, ముఖ్యమంత్రిగా యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, రైతులను ఆదుకుంటానని రకరకాల హామీలతో విడతల విడతలుగా పాదయాత్ర కూడా నిర్వహించిన షర్మిల.. ఇక ఆ ఒంటరి ప్రస్థానాన్ని చాలించి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిక, తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సంబంధించి చాలా కాలం నుంచి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆమె కాంగ్రెస్ ఎంట్రీకి ఎలాంటి నిబంధనలు ఆ పార్టీ విధిస్తున్నదో బయటకు రాలేదు. షర్మిల వైపు నుంచి మాత్రం విలీనానికి తాను సిద్ధం అనే సంకేతాలను తాజాగా మరోసారి పంపారు.

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ జరిగి ఆయన మళ్లీ సభలో అడుగుపెట్టిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ మళ్లీ పార్లమెంటు వేదికగా తన గళం వినిపిస్తారని.. దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ వంటి నాయకుడి అవసరం ప్రస్తుతం మన దేశానికి చాలా ఉన్నదని కూడా ఆమె ప్రశంసించారు. రాహుల్ గాంధీని ఈ స్థాయిలో ఏకపక్షంగా కీర్తించడం వెనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం షర్మిల తొందరపడుతున్నారనే సంకేతాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలిగా, సారధిగా ఒకవైపు.. కెసిఆర్ సర్కారు మీద తీవ్రమైన విమర్శలతో చెలరేగిపోతూ మరొకవైపు.. రాష్ట్రమంతా సుడిగాలిలా పర్యటనలు సాగిస్తూ ముందుకు వెళుతున్న షర్మిల- తాను పడుతున్న కష్టానికి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ఎంతగా తిరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం అనేది జరగలేదు. పార్టీలో ఒకే ఒక్క నాయకురాలుగా ఆమె ముందుకు వెళుతున్నారు. కేసీఆర్ మీద పోరాడడానికి విపక్షాలన్నింటినీ కలుపుకుపోవాలనుకున్న షర్మిల ప్రయత్నాలను వామపక్షాల సహా ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో ఆమెకు పార్టీ నిర్వహణ భారంగా మారే దుస్థితి ఏర్పడింది. పులి సవారీలాగా తయారైంది. ఈలోగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, అక్కడ విజయ సారధి డీకే శివకుమార్ వంటి నాయకులు షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం వంటి పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ లో చేరడానికి షర్మిల చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. కాకపోతే గౌరవప్రదంగా ఉండేలాగా చూసుకుంటున్నారు.

కాంగ్రెస్ మాత్రం ఆమెను తమలో చేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆమె సేవలను ఉపయోగించుకునేట్లయితేనే తమకు లాభం ఉంటుందని భావిస్తోంది. కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితం అయ్యేటట్లయితే ఇప్పటికే ఉన్న ముఠాలు చాలవన్నట్టుగా, కొత్త తలనొప్పిని కొని తెచ్చుకున్నట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ లాంటివాళ్ళు షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆమెను ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని కోరుకుంటున్న వారు కూడా తెలంగాణలో ఉన్నారు. ఇన్ని మతలబుల మధ్య ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేది ఎలా సాధ్యమవుతుందో చూడాలి. రాహుల్ గాంధీని ఈ స్థాయిలో మళ్లీ మళ్లీ కీర్తిస్తూ సంకేతాలు ఇచ్చినంత మాత్రాన ఆమె పట్ల పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుందో గమనించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles