బాబాయ్ జయంతిని అబ్బాయిలు మర్చిపోయారా!

Friday, December 20, 2024

దిగవంత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తమ కుటుంబం వారు అని, ఆయనను హత్యచేసి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని అంటూ “నీచ రాజకీయాల” గురించి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాని, రాజకీయ దురుద్దేశ్యంతో ఈ కేసులో తనను నిందితునిగా చేస్తున్నారని అంటూ ఆరోపణలు చేస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం ఆయన 72వ జయంతిని మరచిపోయిన్నట్లున్నారు. 

సొంత తండ్రిని పొట్టన పెట్టుకున్నారంటూ తీవ్రమైన నిందలకు గురయిన ఆయన కుమార్తె డా. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు మాత్రమే పులివెందులలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తన గురించి కొందరు మాట్లాడుకునే విషయాలను తండ్రి దృష్టికి తీసుకెళ్లానని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

పొగడ్తలను పట్టించుకోవద్దని, తప్పును వేలెత్తి చూపించే అంశాలపై దృష్టిపెట్టాలని అప్పట్లో ఆయన సూచించారని చెప్పడం ద్వారా తండ్రి హంతకుల గుట్టు రట్టు చేసేందుకు తాను పడుతున్న ఆరాటాన్ని సూక్ష్మంగా ఆమె చెప్పుకొచ్చారు. అయితే, ఆశ్చర్యంగా మొదట్లో వివేకానందరెడ్డి హత్యకు కారణం అంటూ సాక్షి ద్వారా దుష్ప్రచారంకు గురైన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివేకానందరెడ్డి జయంతిని గుర్తు పెట్టుకోవడం గమనార్హం.

వివేకానందరెడ్డి జయంతిని అబ్బాయిలు మర్చిపోయినట్టు ఉన్నారని లోకేశ్ పేర్కొన్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ, వర్ధంతి మాత్రం డేట్, టైమ్ తో సహా గుర్తుంటుందనే విషయాన్ని సీబీఐ నిర్ధారించిందని చెప్పారు. వేటు వేసిన చేతులతో బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు అని ఎద్దేవా చేశారు. అబ్బాయిల వేధింపులు, కుతంత్రాలకు ఎదురొడ్డి చేస్తున్న న్యాయపోరాటంలో సునీత గెలుస్తారని ఈ సందర్భంగా లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్ తో ఊచలు లెక్క పెట్టించేంత వరకు ఆమె విశ్రమించరని చెప్పారు. వివేకా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. కాగా, వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని అంటూ ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు డా. సునీత భరోసా వ్యక్తం చేశారు. అయితే, సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి కామెంట్‌ చేయనని సునీత చెప్పారు. ఆమె సాగిస్తున్న న్యాయపోరాటం కారణంగానే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ దర్యాప్తు ప్రారంభం అయ్యేటట్లు చేశారు.

మరోవంక, సిబిఐ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుండగా కేసు విచారణను ఏపీ నుండి తెలంగాణ హైకోర్టుకు మార్పించడం ద్వారా కేసు వేగం పుంజుకొనేటట్టు చేశారు. చివరకు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను నిందితులుగా పేర్కొనడం, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ దూకుడుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా చివరకు న్యాయం జరుగుతుందనే భరోసాతో డా. సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles