రేవంత్ రెడ్డికి చెక్ పెడుతున్న కొప్పుల రాజు!

Friday, December 20, 2024

తెలంగాణాలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదేమైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలగా పనిచేస్తూ, ఇక్కడున్న నేతలు అందరిని ఒకటిగా పనిచేసేటట్లు చేస్తుండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయంలో పనిచేస్తున్న కీలక నేత, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు స్వయంగా ఇక్కడ నాయకుల మధ్య కుంపటి రాజేస్తుండటం జరుగుతుంది.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి రాహుల్ గాంధీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల వ్యవహారాలలో రాజుపై ఆధారపడుతున్నారు. ప్రతికూల పరిస్థితులలో పార్టీని బలోపేతం చేయగల నేతలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన నేతలను రాజు ప్రోత్సహిస్తున్నారు. రాజు సలహాలపై ఆధారపదాటిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ దుకాణం దాదాపు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణాలో రాజును కాదని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీలో కొంత జోష్ వచ్చింది. అందుకు కర్ణాటక ఫలితాలు కూడా తోడు కావడంతో ఇప్పుడు అధికారంలోకి రాగలమనే నమ్మకం పార్టీ నేతలలో కలుగుతుంది.

రేవంత్ ఎదుగుదలను మొదటి నుంచి ప్రతిఘటిస్తూ వస్తున్న సీనియర్ నేతలు ప్రస్తుతం అధిష్టానం హెచ్చరికలతో మౌనంగా అంటున్నప్పటికీ  అప్పుడప్పుడు వేర్పాటు కుంపట్లను పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు కొప్పుల రాజు మద్దతు లభించడంతో వారంతా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ కు పోటీగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఫోకస్ చేసేందుకు కొప్పుల రాజు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. విక్రమార్కకు బాసటగా నిలబడాలని సీనియర్ నేతలు అందరిని కోరుతున్నారు. తాజాగా ఈ విషయమై మేడ్చల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలిసింది.

కాబోయే ముఖ్యమంత్రిగా విక్రమార్కను ఫోకస్ చేయడం ద్వారా రేవంత్ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే తప్ప రేవంత్‌రెడ్డి దారిలోకి రారని, లేదంటే ఆయనను కట్టడి చేయడం కష్టమని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ నేతలంతా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణా ఉద్యమం సందర్భంగా కొత్త రాష్త్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు ఉంటాడని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దానిని సాకుగా తీసుకొనే కాంగ్రెస్ గెలిస్తే దళిత్ ను సీఎం చేస్తామంటూ భట్టి విక్రమార్క ను ముందుంచాలని కొప్పుల రాజు ఎత్తుగడగా కనిపిస్తున్నది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా దళితుడు కావడం, కాంగ్రెస్ అధికారంలోకి రాగాల మరే రాష్ట్రంలో కూడా దళితుడిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు లేకపోవడంతో రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు దళిత్ సీఎం చేసేందుకు ఇష్టపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఆలోచనతోనే ఇటీవల భట్టి విక్రమార్క తో పాదయాత్ర జరిపించి, యాత్ర ముగింపు బహిరంగసభకు రాహుల్ గాంధీ వచ్చేటట్లు చేశారు.

ఏపీలో కూడా శైలజానాథ్ ను పిసిసి అధ్యక్షునిగా చేసి, అక్కడ కాంగ్రెస్ చతికలపాడేటాటు చేసింది, పలువురు ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలవైపు చూసేటట్లు చేసింది కూడా కొప్పుల రాజు అనే విమర్శలు చెలరేగుతున్నాయి, ఇప్పుడు శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు దిక్కులు చూస్తుండటం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles