‘‘పోలవరానికి నాకు సంబంధం లేదు. ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందనే సంగతి నన్ను అడగవద్దు. నిరాశ్రయులైన వారికి పునరావాసం సొమ్ము ఎప్పటికీ దక్కుతుంది అనే విషయంలో నాకు పూచి లేదు..’’ అచ్చంగా ఈ మాటలను పలకలేదు గాని ఇంతకంటే స్పష్టంగా, ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. పోలవరం నిర్వాసితుల్లో తనకు కనీస మాత్రంగానైనా ఓటు బ్యాంకు ఉంటుందనే నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే కాస్త అనునయ పూర్వకంగా కూడా ఆయన వారితో మాట్లాడలేదు. చాలా కరాఖండిగా తేల్చి చెప్పారు. కేంద్రం నిధులిస్తే తప్ప అడుగుముందుకు పడే అవకాశం లేదని తేల్చేశారు.
గొమ్ముగూడెంలో పోలవరం నిర్వాసితులను కలిసిన ముఖ్యమంత్రి జగన్.. వారికి ఏ స్పష్టమైన హామీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. పైగా, పోలవరం నేను కట్టడం లేదు. కేంద్రం కడుతోంది.. అని కాడి పక్కన పారేసినట్లుగా చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి.. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను.. అంటూ సొంతగొప్పలు చెప్పుకోడానికి ప్రాధాన్యం ఇచ్చారు. నేనే కడుతూ ఉంటే గనుక.. ముందుగా మీకు పునరావాసం పూర్తిచేశాకే ప్రాజెక్టు కట్టేవాడిని అని కూడా చెప్పారు.
‘‘మన ఖర్మ ఏంటంటే.. పునరావాసం అమలు అనేది కేంద్ర సహాయంతో ముడిపడి ఉంది. అందుకే చేయలేకపోతున్నాం’’ అని చెప్పేశారు. ‘మన ఖర్మ’ అంటూ ఆయన చేతులు దులుపుకున్నారు గానీ.. నిజానికి ఇలాంటి బాధ్యతారహితంగా మాట్లాడే ముఖ్యమంత్రి నిర్వాసితుల ఖర్మ అని ప్రజలు విమర్శిస్తున్నారు.
2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి కావొచ్చునని అంటున్న జగన్.. ఇప్పట్లో పోలవరం గురించి ఆశలుపెట్టుకోవద్దునని పరోక్ష్గంగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ నెలాఖరుకెల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందితే 17వేల కోట్ల వరకు నిధులు అందుతాయి. అవి రాగానే మీకు అందజేస్తాను. ఇదంతా బహుశా జనవరికెల్లా పూర్తవుతుందని అనుకుంటున్నాను.. అంటూ.. అన్నీ అస్పష్టంగానే జగన్ సెలవిచ్చారు. ఈ అస్పష్టతకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘ఎందుకంటే కేంద్ర కేబినెట్ ఆమోదం నాచేతుల్లో ఉండదు కదా’ అని చెప్పారు.