కొత్త కమిటీ ఏర్పాటు వత్తిడిలో చిన్నమ్మ!

Friday, December 20, 2024

అనూహ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరి ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై తనదైన మార్క్ చూపించుకునేందుకు మొదటగా ప్రస్తుత కమిటీని మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే అందుకు పాత అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆయనకు మద్దతుగా ఉంటూ వచ్చిన సునీల్ దేవధర్, జివిఎల్ నరసింహారావు వంటి వారు తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.

కేవలం అధ్యక్షుడిని మాత్రమే మార్చారని, మిగిలిన కమిటీ పాతదే కొనసాగించాలంటూ వాదనలు ప్రారంభించారు. అయితే కేవలం అధ్యక్షుడిని మార్చితే ప్రయోజనం ఏమిటని, మొత్తం కమిటీని మార్చాల్సిందే అని ఆమె పట్టుబడుతున్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాలతో  సహితం స్పష్టం చేశారు.

కేంద్ర నాయకులు మాత్రం కొత్త కమిటీ ఏర్పాటులో ఆమెకు స్వేచ్ఛను ఇచ్చారు. అయితే ప్రశ్న ఏమిటంటే ఏపీ బీజేపీలో ఆమెకంటూ ఎవ్వరూ లేరు. ఆమెతో పాటు పార్టీలో చేరిన వారెవ్వరూ లేరు. సోము వీర్రాజు హయాంలో వేలంపాట మాదిరిగా పదవులను అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎంతో ఖర్చు పెట్టి పొందిన పదవులు పోగొట్టుకోవడం వారికి కూడా కష్టంగానే ఉంటుంది గదా.

ఇక సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న వారంతా మాజీ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు మద్దతు దారులుగా పేరొందారు. వెంకయ్య నాయుడు ముద్ర ఉండకూడదనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా సత్యకుమార్ నియామకాన్ని ప్రధాని మోదీ వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. అందుకనే ఇప్పుడు వెంకయ్య నాయుడు ముద్ర పడకుండా, సోము వీర్రాజు `కోటరీ’ని కూరంగా పెడుతూ కొత్త కమిటీని నియమించడం పురందేశ్వరికి కఠిన పరీక్షగా మారింది.

మరోవంక, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఒక జాబితాను ఆమె ముందుంచుతున్నాను. వారంతా వారి చుట్టూ తిరిగే భజనపరులే తప్పా జనంతో ఏమాత్రం సంబంధం లేనివారు. లేదా ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపని వారు. ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కాకుండా ఇప్పటి వరకు అడ్డుకున్న ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇప్పుడు ఆమె కమిటీపై తమ ముద్ర ఉండాలని పట్టుబడుతున్నారు. వారిని సహితం కాదనలేని పరిస్థితులు ఆమెకు ఉన్నాయి.

పాత, కొత్త కలయికతో రెండు, మూడు రోజుల్లో కొత్త కమిటీని నియమిస్తామని గత వారం ఢిల్లీలో ఆమె ప్రకటించారు. అయినా ఇంకా కమిటీ కూర్పు పూర్తవుతున్న దాఖలాలు లేవు. పైగా వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా కమిటీ ఉండాల్సి ఉంది.

అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి విజయవాడ పార్టీ కార్యాలయంలో అందరిని పలకరిస్తూ తీయగా మాట్లాడుతూ, మధ్యలో మీడియా ముందు మాట్లాడుతూ ఆమె కాలం గడుపుతున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా నీయమితులై నెలరోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకూ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ శ్రేణుల ముందు నిర్దుష్టంగా ఎటువంటి కార్యక్రమం ఆమె ఉంచలేక పోయారు.

ఆమెతో పాటు రాష్ట్ర అధ్యక్షునిగా నియమితుడైన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణాలో అందుకు భిన్నంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఒక వంక పాత అధ్యక్షుడు బండి సంజయ్ చుట్టూ తిరిగిన వారిని తగినంత దూరంగా ఉంచుతూ, ఆయన దూరంగా ఉంచిన నేతలను దగ్గరకు తీస్తూనే పార్టీలో అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యవహరింప గలుగుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles