పేరుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎన్నో పదవులు ఇస్తున్నప్పటికీ కీలక పదవులన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి దక్కుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పైగా కీలక పదవులు బంధువులు, తమ కుటుంభంకు సన్నిహితంగా ఉంటున్నవారికే ఇస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. సుబ్బారెడ్డి సీఎం జగన్ కు బాబాయి కాగా, కరుణాకరరెడ్డి సహితం వారి కుటుంభంకు చెందినవారే. ఆయన తాతగారైన వైఎస్ రాజారెడ్డి సొంత కుమారుడిగా ఆదరించారు. ఆయనకు సంబందించిన కాంట్రాక్టు వ్యవహారాలను చివరివరకు ఆయన చూస్తూండేవారు.
తన ప్రభుత్వంలో కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కుతున్నాయనే విమర్శలు చెలరేగడం, త్వరలో ఎన్నికలు వస్తుండటంతో ఈ సారి టీటీడీ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్యెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది.
అయితే, వైఎస్ కుటుంభంకు మొదటి నుంచి సన్నిహితులు కావడమే కాకుండా, జగన్ పార్టీ పెట్టిన్నప్పటి నుండి కీలకంగా వ్యవహరిస్తున్న తిరుపతి ఎమ్యెల్యే భూమనతో పాటు, ఆ పక్కనే ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఈ పదవి ఈ సారి తమకే ఇవ్వాలని తీవ్రమైన వత్తిడి తెచ్చిన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి వారిద్దరూ మంత్రి పదవులు ఆశిస్తూ వచ్చారు. అయితే వారు మంత్రులయితే తన ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంతో ఉమ్మడి చితూర్ జిల్లాలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు అన్ని దాదాపు నిర్దేశిస్తున్న మంత్రి డా. పి రామచంద్రారెడ్డి అందుకు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వారిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తాను మంత్రిగా ఉండనని బెదిరిస్తూ వస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వంలో తమకు తగు ప్రాధాన్యత లభించడం లేదని, తామిద్దరం తమ తమ నియోజకవర్గాలకు పరిమితం కావాల్సి వస్తుందని వారిద్దరూ తీవ్ర అసహనంతో ఉంటూ వస్తున్నారు. పైగా, వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని ఆ ఇద్దరూ ప్రకటించారు. తమ తమ కుమారులను పోటీ చేయిస్తున్నట్లు తమకు తామే ప్రకటించుకున్నారు.
కేవలం అంతర్గత వత్తిడుల కారణంగానే వైఎస్ జగన్ టిటిడి చైర్మన్ నియామకం చేయాల్సి వచ్చిన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కరుణాకరరెడ్డి రాడికల్ విద్యార్ధి ఉద్యమం నుండి వచ్చారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు. అటువంటి వ్యక్తిని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి టిటిడి చైర్మన్ గా నియమించడం విమర్శలకు దారి తీసింది.
తిరుపతి ఎమ్మెల్యే భూమన గతంలోనూ టీటీడీ ఛైర్మన్, పాలక మండలిలో సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత వైఎస్సార్ హయాంలో 2006 నుంచి 2008 వరకు భూమన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు 2004-06 వరకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్(తుడా) ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. రెండేళ్ల పాటు ఆయన టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.