ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ మోకాలడ్డు!

Thursday, December 19, 2024

తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య అసాధ్యంగా కనిపిస్తున్నది. వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నేరుగా ప్రభుత్వంపై విసుర్లు విసురుతున్నారు.  నిన్న గాక మొన్నా వరంగల్ లో వరదబాధిత ప్రాంతాలలో పర్యటించిన గవర్నర్ రాష్త్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటె నష్టం కొంతమేరకు అరికట్టి ఉండేవారంటూ నేరుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొంటూ సున్నితంగా చివాట్లు పెట్టారు. 

తాము కూడా తగ్గేది లేదన్న రీతిలో మంత్రులు సహితం తరచూ గవర్నర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. బీజేపీ ప్రతినిధిగా పని చేస్తూ బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అసెంబ్లీ ఆమోదించిన మొత్తం 10 బిల్లులను గవర్నర్ తన వద్దే ఉంచుకొన్నారంటూ కేసీఆర్ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం జాతీయ స్థాయి దృష్టి ఆకట్టుకొంది. అయితే సొలిసిట్ జనరల్ సలహాతో గవర్నర్ ఆ బిల్లులను త్వరితగతిన డిశ్చార్జ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం విచారణను తప్పించుకున్నారు. 

కొన్ని బిల్లులను రాష్త్రపతికి పంపడం, కొన్ని బిల్లులను తిరస్కరించడం, కొన్ని బిల్లులను ఆమోదించడం చేశారు.  గవర్నర్ ఆమోదించని బిల్లులను తిరిగి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం పరోక్షంగా గవర్నర్ చర్యపై `అభిశంస’కు దిగుతున్నది.  ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగా, తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆర్టీసీ విలీనం బిల్లుకు సంబంధించి రాజ్ భవన్ నుంచి అనుమతి రాలేదు. దీంతో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లు వివాదం రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కేసీఆర్ సర్కార్ ఈ బిల్లును గవర్నర్‌ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచినా రాజ్‌భవన్‌లో ఆమోదం తెలపలేదు. ప్రభుత్వం ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావించింది. ఈ బిల్లు ఆర్థికపరమైనది కావడంతో గవర్నర్‌కు పంపించింది. పైగా ఆగస్టు 6వ తేదీ వరకు మాత్రం అసెంబ్లీ నడపాలని బీఏసీ నిర్ణయించింది.

అప్పటిలోగా ఆమోదం వస్తుందా..? లేదా అన్న చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఆర్టీసీ విలీన బిల్లుపై సందిగ్ధత నెలకొంది. ఈ లోగా ఆర్టీసీ బిల్లు అంశంపై రాజ్ భవన్ కార్యాలయ స్పందించింది. బిల్లు పరిశీలనకు కాస్త సమయం కావాలని అభిప్రాయపడింది. ఆర్టీసీ బిల్లుపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.  ఫలితంగా బిల్లుకు గవర్నర్ నుంచి అనుమతి రావటం, పైగా సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపటం వంటి ప్రక్రియకు ఎంత సమయం పడుతుందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఆర్టీసీ ముసాయిదా బిల్లు 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరింది. 3వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నందున ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావచ్చని భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ బిల్లు రాజభవన్ లోనే ఆగిపోవడం ప్రభుత్వమును ఇరకాటంలో పడవేస్తున్నది. మరోవైపు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవటంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై శుక్రవారం పలు సంఘాలు భేటీ అయినట్లు తెలుస్తోంది. రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles