రెచ్చగొట్టనేల? పలాయనం చిత్తగించనేల!!

Sunday, December 22, 2024

తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమావేశం పెట్టుకుంటున్నా చాలు.. అక్కడకు వెళ్లి ఏదో ఒక రీతిగా వారిని రెచ్చగొట్టడం, కవ్వించడం, వారిని ముగ్గులోకి లాగి రభస చేయడం అనేది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు ఒక అలవాటులాగా మారిపోయిందని.. ఇటీవల పలుచోట్ల పరిణామాలు గమనిస్తోంటే అర్థం అవుతూ ఉంటుంది. తెలుగుదేశం మాత్రమే కాదు.. జనసేన కార్యక్రమాల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. విపక్షాల కార్యక్రమాలకు అడ్డుపడ్డడం రభస చేయడం అనేది ఒక రివాజుగా మారిపోయింది. పోలీసులు చాలా సహజంగా కాస్త ఆలస్యంగా రంగంలోకి రావడం.. ఇరు వర్గాలను చెదరగొట్టడం.. ప్రతిపక్షానికి చెందిన నాయకుల మీద కేసులు నమోదు చేయడం కూడా చాలా అలవాటుగా మారిపోయిన వైనం మనం గమనిస్తున్నాం. అయితే కడప జిల్లా పులివెందులలో మాత్రం ఇందుకు భిన్నమైన వ్యవహారం చోటుచేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు బుధవారం నాడు గండికోట ప్రాజెక్టును సందర్శించారు. అక్కడినుంచి పులివెందులకు వచ్చి అక్కడ రోడ్ షో కూడా నిర్వహించారు. వైఎస్ జగన్ అడ్డా అయిన పులివెందులలో చంద్రబాబునాయుడు రోడ్ షో సక్సెస్ అయితే ఇంకేమైనా ఉందా? అని అనుకున్నారేమో తెలియదు గానీ.. వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు ప్రయత్నించారు.

షెడ్యూలు ప్రకారం.. పులివెందులలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్ షో సభ నిర్వహించాల్సి ఉంది. ఆయన రాకకు ముందే.. చాలా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పులివెందులలో గతంలో చంద్రబాబు నిర్వహించిన ఏ సభకంటె కూడా ఎక్కువ మంది అక్కడ గుమికూడారు. అయితే ఓ కారులో అక్కడకు వచ్చిన కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు  పార్టీ జెండాలు పట్టుకుని.. తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టే మాటలతో కవ్వింపు చర్యలకు దిగారు. చంద్రబాబు వ్యతిరేక నినాదాలు చేశారు. కాసేపు ఊరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆ తరువాత వెంటపడి తరమడంతో.. కారులోని వైసీపీ కార్యకర్తలు ఒక్క ఉదుటున అక్కడినుంచి పారిపోయారు. కనీసం కారు డోరు కూడా వేసుకోకుండా.. తమను కొడతారనే భయంతో అక్కడినుంచి పలాయనం చిత్తగించడం స్పష్టంగా కనిపించింది.

ఎవరి పార్టీ కార్యక్రమాలు వారిని చేసుకోనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టనేల? పలాయనం చిత్తగించనేల? అని జనం నవ్వుకోవడం కనిపించింది. పోలీసుల దన్ను చూసుకుని ప్రతిఊరిలోనూ రెచ్చిపోయి దాడులకు తెగబడే వైసీపీ దళాలు.. పులివెందులలో పోలీసులు రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి తోకముడిచి పారిపోవడం ద్వారా జగన్ పరువు పోయిందని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles