వైసిపిపై చిన్నమ్మ విమర్శలపై విజయసాయిరెడ్డి చురకలు

Monday, December 23, 2024

బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పట్ల ఇప్పటివరకు అధికార పార్టీ నేతలు మౌనం వహిస్తూ వస్తున్నారు. ఆమె ప్రభుత్వంపై ఎంత ఘాటుగా విమర్శలు కురిపిస్తున్న, నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు జగన్ ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాలలో పలు అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.

అయితే, తాజాగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సుతిమెత్తగా చివాట్లు పెట్టినట్లు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు సరే, ముందుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయం గురించి నోరెత్తవేమిటమ్మా? అన్నట్లు చురకలు అంటించారు.

కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! అంటూ హితవు పలికారు. అలా చేస్తే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుందంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.  ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? అంటూ పరోక్షంగా ఆమె టిడిపి అజెండా మోసుకొంటున్నట్లు ఎద్దేవా చేశారు.   తన ట్వీట్ కు ఆమె విశాఖపట్టణంలో బిజెపి జోనల్ సమావేశంపై వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ  ఫొటోను కూడా జత చేశారు.

“కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు…వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?” అంటూ ప్రశ్నించారు.  బీజేపీ లో ఉన్నా, లోపాయికారిగా ఇతర పార్టీలకు (టిడిపికి) పనిచేస్తుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను, వైజాగ్ రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ సమస్యలను గుర్తుచేసి బిజెపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.

మరోవంక, వైసిపి పాలనపై అంత ఘాటుగా విమర్శిస్తున్న ఆమె కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుందని మీడియా వారడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పురందేశ్వరి తడబాటుకు గురయ్యారు. అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీ మద్దతు ఎందుకు ఇస్తున్నారో వైసీపీ నాయకులనే అడగాలని ఆమె సూచించారు. అయితే, వైసీపీతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

వైసీపీతో తమకు ఎలాంటి విశ్వాస బంధం లేదని పురంధేశ్వరి ప్రకటించారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకోవడంపై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.  అయితే, అంశాల వారీగా టిఎంసి కూడా బీజేపీకి మద్దతిస్తుందని, బీజేడీ కూడా ఒడిశాలో అంశాల వారీగా మద్దతిస్తుందని ఆమె గుర్తు చేశారు. అయా పార్టీలు బీజేపీకి ఎందుకు ఎందుకు మద్దతిస్తున్నాయో వారినే అడగాలని అంటూ వైసీపీతో బంధం విషయంలో దాటవేసే ప్రయత్నం చేశారు.

బిజెపి నేతలు జగన్ పాలనపై ఎంతగా విమర్శలు కురిపిస్తున్నా జనం మాత్రం ఆ రెండు పార్టీలను ఒకే గాటిన కట్టి చూస్తున్నారని స్పష్టం అవుతుంది. గతంలో కొందరు బీజేపీ సీనియర్ నేతలే ఈ విషయం అంగీకరించారు. అందుకనే ఎమ్యెల్సీ ఎన్నికలలో పరాజయంకు గురయ్యామని ప్రకటనలు కూడా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles