తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే పదవికి పోటీచేయబోయేది లేదని ఆల్రెడీ ప్రకటించారు. ఈ మాట విని.. ఆహా ఎంత ఔదార్యమైన నాయకుడు… కొత్తతరానికి అవకాశం ఇవ్వడానికి త్యాగం చేస్తున్నాడని అనుకుంటే పొరబాటే! ఎందుకంటే.. ప్రస్తుతం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న తన కుమారుడు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని ఆయన కలగంటున్నారు. సరే పోన్లెద్దూ.. మరీ అంత కాకపోయినా.. కొంతైనా ఆయనలో ఔదార్యం ఉన్నట్టే అనుకుందాం.. తన పదవిని కొడుక్కు ఇచ్చేసి.. ఏదో కృష్ణారామా అనుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ గడిపేస్తాడేమో.. అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తే.. మళ్లీ పొరబాటే! ఎందుకంటే.. ఆయన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ.. అందరూ మంత్రిపదవికంటె పెద్దదిగా భావించే టీటీడీ ఛైర్మన్ పదవికి వల విసురుతున్నారు.
గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తితిదే ఛైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర రెడ్డి.. అప్పట్లో అనేక వివాదాస్పద నిర్ణయాలకు కూడా కారణం అయ్యారు. అయినా సరే.. వైఎస్ఆర్ ఆశీస్సులు ఉండడం వలన.. ఆయన అప్రతిహతంగా తన ఇష్టానుసారంగా ఆ పదవిని నిర్వహించారు. ఆ తర్వాత జగన్ జమానాలో ఎమ్మెల్యే అయిన తర్వాత.. లోకల్ ఎమ్మెల్యే గనుక.. ఆటోమేటిగ్గా టీటీడీ బోర్డు మొబరుగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఇక్కడితో సంతృప్తి కలగడం లేదు. ఎమ్మెల్యే పదవిని తన కొడుక్కి కట్టబెట్టేసి.. మళ్లీ టీటీడీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటున్నారు. అందుకే జగన్ వద్దకు వెళ్లి మంతనాలు సాగించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు 12న ముగుస్తుంది. ఆయన క్రియాశీల ఎన్నికల రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు గనుక.. మూడోసారి బోర్డు చైర్మన్ పదవి ఆశించడంలేదు. అదే సమయంలో జగన్.. బీసీలకు పదవి ఇచ్చి ఆ వర్గాలను ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే మధ్యలో భూమన ఎంట్రీ ఇచ్చి తనకు బోర్డు ఛైర్మన్ కావాలని అడగడం తాజా పరిణామం. ఒక వైపు త్యాగమూర్తి అవతారం ఎత్తుతూ, మరోవైపు అంతకంటె పెద్ద పదవికి గేలం వేస్తూ.. భూమన భలే స్కెచ్ వేశారని ప్రజలు అనుకుంటున్నారు.