గన్నవరం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు ఇక తిరుగు లేదని ధీమాతో ఉన్న వల్లభనేని వంశీకి ఇప్పటి నుండి మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు నుండి ముప్పు ఎదురవుతుంది. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేస్తా అంటూ ఘంటాపధంగా ప్రకటించడంతో అభ్యర్థి విషయమై అధికార పక్షంలో చీలిక స్పష్టంగా వెల్లడవుతుంది.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందినా ఆ తర్వాత అనధికారికంగా వైసీపీ ఎమ్యెల్యేగా కొనసాగుతున్న వంశీని ఆచరణలో స్థానిక వైసీపీ వర్గాలు మాత్రం అక్కున చేర్చుకోవడం లేదు. మరోవంక టిడిపి క్యాడర్ సహితం అతనికి వ్యతిరేకంగా ఉంటుంది. అప్పటి వరకు వైసీపీలో ఉన్న వర్గాలు వంశీని వ్యతిరేకించడంతో ఒక్కటిగా వ్యవహరిస్తున్నాయి.
ఈ విషయమై సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు సహితం ఫలించలేదు. ఇటువంటి సమయంలో తాను ఎన్నికల్లో పోటీచేస్తా అంటూ యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించడం ఒక విధంగా వంశీకి హెచ్చరిక సిగ్నల్ పంపించడంగానే పలువురు భావిస్తున్నారు. వైసీపీలో నెలకొన్న కుమ్ములాటలు బహిర్గతం చేసేందుకు దోహదపడింది.
గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీచేసి, వంశీపై వెంకట్రావు ఓటమి చెందారు. మొదటి నుండి వంశీ, యార్లగడ్డ వర్గాలు ఎవ్వరికీ వారుగా ఆధిపత్య ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం మద్దతు పొందగలిగిన స్థానికంగా ఆ పార్టీ శ్రేణులను వంశీ దగ్గరకు చేర్చుకోలేక పోతున్నారు. అధిష్టానం వంశీకే సీట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ పార్టీలో రచ్చకెక్కుతున్న కుమ్ములాటలు ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం చేకూర్చే అవకాశం ఉంది.
వైసీపీలో మొదటి నుండి యార్లగడ్డకు ప్రత్యర్థిగా ఉంటున్న దుట్టా రామచంద్రరావును హనుమాన్ జంక్షన్ లో కలిసి సుదీర్ఘంగా గన్నవరం రాజకీయాలపై చర్చించడం ఆసక్తి కలిగిస్తోంది. ఇద్దరం కలిసి ఉమ్మడిగా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా వంశీని అక్కడ గెలవనియ్యరాదని భీష్మించుకున్నారని తెలుస్తున్నది. ఈ పరిణామం సహజంగానే వైసీపీ పెద్దలకు ఆందోళన కలిగిస్తుంది.
తాను అమెరికా వెళ్ళిపోయి, ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇక్కడే ఉంటానని, ఎన్నికలలో పోటీచేస్తానని తేల్చి చెప్పారు. అయితే, ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానో అనే విషయమై ఏమీ చెప్పక పోవడం ఆసక్తి కలిగిస్తుంది.
తనను కాదని వైసిపి నాయకత్వం వల్లభనేని వంశీకే సీటు ఇవ్వడానికి మొగ్గు చూపితే టిడిపి లేదా జనసేన పార్టీలలో ఏదో ఒక దానిలో చేరి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు టిడిపి సహితం గన్నవరం నుండి తమ అభ్యర్థి విషయమై ఒక నిర్ణయం తీసుకోలేదు. మొత్తం ఉమ్మడి కృష్ణ జిల్లాలో టిడిపికి గన్నవరం, గుడివాడ ప్రతిష్టాకరంగా మారాయి.
వంశీతో పాటు గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నాని కూడా గతంలో టీడీపీ నుండి గెలిచినవారే. వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడల్లా టిడిపిపై, ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దానితో వీరిద్దరిని ఓడించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.