ఆల్రెడీ నిందితుల్లో ఒకడిగా తన పేరును కూడా సీబీఐ చార్జిషీటులో చేర్చేశారు. ఇప్పటే బెయిలు మీద ఉన్నారు. ముందుముందు బెయిలు రద్దవుతుందో ఏమో తెలియదు. ఈ సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకుంటున్నారు. సిబిఐ దర్యాప్తు మీదనే ఫిర్యాదు చేస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి వాదన నే మళ్లీ వినిపిస్తూ, సీబీఐ ఎస్పీ రాంసింగ్.. చేసిన దర్యాప్తు తప్పు అంటూ డైరక్టర్ కు లేఖ రాయడం ఆశ్చర్యకరం.
వివేకానంద రెడ్డి హత్య కేసులో షర్మిల సుజాత వాంగ్మూలాలు కూడా బయటకు వచ్చిన తర్వాత తన చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగుసుకుంటున్నదని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అర్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఆ విషయం అర్థమైనంత మాత్రాన ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ ఆయన కొన్ని నెలలుగా ఏ మాటలైతే చెబుతూ వస్తున్నారో అదే పాత చింతకాయ పచ్చడి వాదనలను మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నారు. సిబిఐ దర్యాప్తు జరిగిన తీరునే ఆయన తప్పబడుతున్నారు.
దర్యాప్తు మొత్తం పూర్తయి ఛార్జ్ షీట్లను కూడా సవరించి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను కూడా నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన తర్వాత కూడా ఆయన అర్థరహితంగా కనిపించే తన పాత వాదనలను మళ్ళీ వినిపిస్తుండడం ఆశ్చర్యకరంగా ఉంది. సిబిఐ అధికారి రామ్ సింగ్ పక్షపాత ధోరణితో దర్యాప్తు చేశారని, ఆయన దర్యాప్తు తీరును సమీక్షించాలని డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఈనెల 19న అవినాష్ రెడ్డి లేఖ రాశారు.
సీబీఐ ఎస్పీ రాంసింగ్ దర్యాప్తును తప్పు పట్టడం తప్ప అందులో కొత్త విషయాలు పెద్దగా ఏమీ లేవు. ‘వివేకానంద రెడ్డి హత్య అనేది పూర్తిగా ఆయన రెండో వివాహం కారణంగానే జరిగింది’ అని సిబిఐ ని నమ్మించేందుకు అవినాష్ చేస్తున్న వృధా ప్రయత్నం ఆ లేఖలో మళ్ళీ కనిపిస్తుంది. ఒకవైపు తన పేరిట మిగిలిన ఆస్తులు రెండో భార్య ద్వారా పుట్టిన కొడుకుకు ఇవ్వడానికి వివేకానంద రెడ్డి నిర్ణయించుకున్నారని చెబుతూనే ఆ ఆస్తి పత్రాలను తస్కరించడానికి ఈ హత్య జరిగి ఉండవచ్చు అని అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొంటున్నారు. కేవలం దస్తగిరి చెప్పిన సమాధానాలు ఆధారంగానే రామ్ సింగ్ విచారణ జరిగిందనేది అవినాష్ ప్రధాన ఆరోపణ. ఆయన చేసిన తప్పులను సిబిఐ ఉన్నతాధికారులు సవరించాలని అంటున్నారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని కోరడం కొసమేరుపు.