తెలంగాణ కాంగ్రెస్ లో వలస నేతల చిచ్చు!

Sunday, December 22, 2024

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షిస్తూ, వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ఉండడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తామని జోష్ పెరుగుతున్నా మరోవంక మొదటినుండి పార్టీకోసం పనిచేస్తున్న నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న చిచ్చు రేగుతుంది.  వేరే పార్టీల నుంచి వస్తేనే ప్రాధాన్యత ఇస్తారా? లేకుండా అస్సలు పట్టించుకోరా? అంటూ పార్టీ శ్రేణులు చిందులు వేస్తున్నారు.  

ముఖ్యంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసమ్మతి స్వరం వినిపించడం పార్టీ వర్గాలలో కలకలం రేపుతోంది.  ఎప్పుడూ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ, ప్రతీ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ గొంతుకై వినిపించే పొన్న ప్రభాకర్ ఇప్పుడు ఇలా పార్టీ నాయకత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో ఇటీవల పార్టీలో చేరిన వారి పేర్లుండటం, తనకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

26మంది ఎన్నికల కమిటీలో తనకు స్థానం దక్కని తీరుపై పొన్నం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మూడు రోజులుగా పొన్నం నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఈ విషయంలో ఆయనకు తమ సంఘీభావం తెలుపుతున్నారు. 

కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎన్నికల కమిటీలో అవకాశం కల్పించి, ఎన్‌ఎస్‌ఐయూ నుంచి కాంగ్రెస్ పటిష్టత కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్న పొన్నంను మాత్రం పక్కన పెట్టడం పట్ల వారంతా అసంతృప్తిని వ్యక్త్తం చేశారు. హైకమాండ్ చర్య పొన్నంను అవమానించేదిగా ఉందని వారు వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి కాంగ్రెస్ ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధిష్ఠానాన్ని కలిసి తాడోపేడో తేల్చుకొనేందుకు ఆదివారం పొన్నం వర్గీయులు కరీంనగర్ లో సమావేశమై నిర్ణహించుకున్నారు.  పార్టీలో తన గొంతున గట్టిగా వినిపిస్తూ బలమైన నేతగా పేరు తెచ్చుకున్న పొన్నంకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా  ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యత ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారికి లేదా? ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ కు కమిటీలో స్థానం కల్పించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ ఎన్నికల కమిటీలో అవసరమైతే తన పేరు పక్కన పెట్టి పొన్నం ప్రభాకర్ కు స్థానం కల్పించాలని చెప్పారు.

ఈ విషయమై హైదరాబాద్ లో గాంధీ భవన్  లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుండగా ద పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలకంగా పని చేశారని అలాంటి వ్యక్తిని అవమానించారని వారు నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు కుట్రలు చేయడం వల్లే ఎన్నికల కమిటీలో పొన్నంకు స్థానం దక్కలేదని వారు ఆరోపించారు. 

పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుట వారు నినాదాలు వ్యక్తం చేశారు. అయితే పిసిసి సమావేశం ఉండటం వల్ల ఆందోళన విరమించాలని పొన్నం వర్గీయులను రేవంత్‌రెడ్డి కోరగా, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకుండా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను అవమానించారంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles