కిషన్ రెడ్డి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి రావడం సంగతేమో గానీ.. తెలంగాణ పార్టీలోని లుకలుకలు మాత్రం బయటపడుతున్నాయి. కిషన్ రెడ్డి పదవీ స్వీకార ప్రమాణ సభ లోంచే అసంతృప్తులు బయటపడుతున్నాయి. బిజెపి క్రమశిక్షణ గల పార్టీ, పార్టీ అసమ్మతులను అంతర్గతంగా మాత్రమే చర్చించుకుంటారు.. బయటపడనివ్వరు.. లాంటి నిర్వచనాలన్నీ గాలికి కొట్టుకుపోతున్నట్టే అనుకోవాలి. ఒకవైపు విజయశాంతి, మరొకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరుల మాటలు పార్టీలోపాలను బయటపెడుతున్నాయి.
కిషన్ రెడ్డి పదవీస్వీకార ప్రమాణ సభ నుంచి ఫైర్ బ్రాండ్ విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారు. దాంతో విజయశాంతి అలకపూనారనే ప్రచారం జరిగింది. సభలో ఆమె కిషన్ రెడ్డికి శాలువా కప్పి, శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయారు. విజయశాంతి అలిగినట్టుగా విస్తృతంగా ప్రచారం జరగడంతో.. ఆమె దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తాను వెళ్లిపోయిన కారణాన్ని ఆమె పూర్తిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీదకు నెట్టేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వేదిక మీద తనకు ఉండబుద్ధి కాలేదని ఆమె చెప్పారు. అందుకే ఆ సభలో ఉండడం ఇష్టంలేక ముందే వెళ్లిపోయాను తప్ప.. కిషన్ రెడ్డి సారథ్యం పట్ల తనకు ఎలాంటి అలక లేదని రాములమ్మ వివరణ ఇచ్చుకున్నారు. కిషన్ కుమార్ రెడ్డికి తాను అభినందనలు, ఆశీస్సులు అందించిన తర్వాతే తాను సభ నుంచి వెళ్లపోయినట్టు ఆమె సెలవిచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి సీఎంగా చరిత్రపుటల్లో మిగిలిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తన విఫలప్రయోగాల తర్వాత.. భాజపా గూటికి చేరుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తాను పార్టీకి సేవలందించగలనని చెప్పారు. ఆయన ద్వారా అందే సేవలు, దక్కే లబ్ధి ఎంత ఉంటుందో గానీ.. పార్టీలో కిరణ్ పుణ్యమాని లుకలుకలు మాత్రం మొదలయ్యాయి.
అదే సమయంలో.. కోమటిరెడ్డి మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ఇవాళ బండి సంజయ్ పరిస్థితి చూస్తే తనకు కన్నీళ్లు వస్తున్నాయని, ఆయన ప్రాణాలకు తెగించి తెలంగాణలో పార్టీ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారని అన్నారు. ఇవన్నీ కిషన్ రెడ్డి నాయకత్వం మీద అసంతృప్త స్వరాలేనా అనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది.