ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను తిట్టిన వారిని పాతాళానికి తొక్కేస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఆయన క్యాబినెట్ లోని మంత్రి కొట్టు సత్యనారాయణ సెలవిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే కనుక రాష్ట్రంలో కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారని కూడా ఆయన హెచ్చరించారు. ‘అకౌంట్ సెటిల్మెంట్’ అనే పదం ద్వారా ఆయన ఏం ధ్వనింపజేయాలని అనుకుంటున్నారో ఎవరిని బెదిరించాలని అనుకుంటున్నారో తెలియదు! మొత్తానికి మంత్రి కొట్టు సత్యనారాయణ మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డి లోని ఫ్యాక్షనిస్టు భావజాలాన్ని తెలియజేసేలా కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సీఎం జగన్ మీద జనసేనాని పవన్ కళ్యాణ్ నిశిత విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించకపోవడానికి ప్రధాన కారణం ఆయనకున్న ప్రజాదరణ, యూత్ లో ఫాలోయింగ్ మాత్రమేనని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘జగన్మోహన్ రెడ్డి తనను తిట్టిన వారిని పాతాళానికి తొక్కేస్తారని’ కొట్టు చెబుతున్న మాటలు వారు గుర్తు చేస్తున్నారు. జగన్ మళ్లీ గెలిస్తే.. విపక్షాల్లోని విమర్శలు చేసే నాయకుల పట్ల ధోరణిఇప్పుడున్నదానికంటె ఘోరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచి ఈ ధోరణి కనిపిస్తూనే ఉన్నదని అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ నాయకుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందుకు నిదర్శనం అని అంటున్నారు. ఆపరేషన్ చేయించుకుని ఇంకా బెడ్ రెస్ట్ లోనే ఉన్న తెలుగుదేశం నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు ను అరెస్టు చేసిన తీరు విజయవాడకు తరలించిన తీరు అప్పట్లోనే బహుధా విమర్శల పాలయ్యాయి. కేసుల సంగతి ఏమైందో తెలియదు కానీ ఆయనను కొన్నాళ్లపాటు జైల్లో ఉంచిన ఘనత మాత్రం ప్రభుత్వానికి దక్కింది.
కొల్లు రవీంద్ర అరెస్టు విషయంలో కూడా ప్రభుత్వం అంతే అమానుషంగా వ్యవహరించిందనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి. సబ్బం హరి పై కక్ష కట్టినట్టుగా దాడులు నిర్వహించి ఆయన మరణానికి కారణమైన వైఖరి కూడా ప్రజలు గమనించారు. చంద్రబాబు నివాసం సమీపంలో ప్రజావేదికను కూల్పించిన ధోరణిని కూడా ప్రజలు గర్హించారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ వ్యవహార సరళి గురించి ఆయన అనుచరుడు మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పడం గమనించాల్సిన సంగతి. జగన్ ను మాట అంటే చాలు పాతాళానికి తొక్కేస్తారు అని మంత్రి చెబుతున్న మాటలకు మాటలకు ఉదాహరణలే ఈ సంఘటనలన్నీ అని ప్రజలు భావిస్తున్నారు. కేవలం ఎన్నికలు దగ్గర పడ్డాయి గనుక.. మాత్రమే.. ప్రత్యర్థులపై తన నిరంకుశ వేధింపులకు దిగడం లేదని, అందుకే మంత్రి కూడా మళ్లీ గెలిస్తే వారి భరతం పడతారన్నట్టుగా చెబుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.