గవర్నర్ పదవి సాధారణ పరిస్థితుల్లో అలంకార ప్రాయమైనది. కొన్ని రాజ్యాంగపర విధులు నిర్వహించేందుకు, ఒక విధంగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా వ్యవహరించాలి. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలలో అన్నింటా ముఖ్యమంత్రి ఆధిపత్యమే కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి, మంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి కొన్ని రాజ్యాంగ పదవులు చేపట్టేవారి ప్రమాణస్వీకారం నిర్వహించడం, మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలకు లాంఛనంగా ఆమోదం తెలపడం, అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం వంటి కొన్ని విధులు లాంఛనంగా నిర్వహిస్తుంటారు. ఛాన్సలర్ గా ఉన్న విశ్వవిద్యాలయాలలో స్నాతకోత్సవంలకు అధ్యక్షత వహిస్తుంటారు.
అంతకు మించి ప్రభుత్వం చేపట్టే అన్ని అధికారిక కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం ఉండదు. కానీ ఇటీవల తరచుగా తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ ప్రభుత్వం తనను ఆహ్వానించలేదని, ఆహ్వానిస్తే హాజరై ఉండేదానిని అంటూ ఒక విధంగా ప్రభుత్వంపై `అసమ్మతి’ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలనుకు ప్రభుత్వం తనను ఆహ్వానించలేదని, ఆహ్వానిస్తే హాజరయ్యే దానిని అంటూ రాజ్ భవన్ లోనే సంబరం ఏర్పాటు చేసుకొని, బోనాలు సంపాదించుకున్నారు. ఇటువంటి ఉత్సవాలకు ఆనవాయితీగా ప్రభుత్వం తరపున ఓ మంత్రి బోనాలు సమర్పిస్తారు. మిగిలిన వారందరూ ఆసక్తి ఉంటె హాజరవుతారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనాలు సమర్పించారు. ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిందా? విజయశాంతి వంటి బిజెపి నాయకులతో పాటు అనేకమంది బోనాలు సంపారించుకున్నారు. వారందరిని ప్రభుత్వం ఆహ్వానించిందా? ఈ విధమైన వాఖ్యలు చేయడం గవర్నర్ లో నెలకొన్న `ఆత్మనూన్యత భావం’ను మాత్రమే వెల్లడి చేస్తుందని విమర్శకులు వాపోతున్నారు.
సచివాలయం ప్రారంభోత్సవంకు, సమీపంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు కూడా తనను ఆహ్వానించలేదని అంటూ గవర్నర్ వాపోయారు. ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొనే కార్యక్రమంలో గవర్నర్ ను ఆహ్వానించడం ఎక్కడైనా జరుగుతుందా? అందుకనే ఆమె ఒక బిజెపి నాయకురాలిగా వ్యవహరిస్తున్నారనే బిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంకు కూడా తనను ఆహ్వానించలేదని గవర్నర్ వాపోయారు. కేవలం ప్రభుత్వం నుండి తలంబ్రాలు సమర్పించేవారు మాత్రమే అధికారికంగా పాల్గొంటారు. మిగిలిన భక్తులు ఎవరైనా వెళ్ళవచ్చు. వారి వారి ప్రోటోకాల్ నిబంధనలను బట్టి గౌరవిస్తుంటారు. ఇటువంటి కనీసం పరిజ్ఞానం గవర్నర్ కు లేదా? లేదా ఉద్దేశపూర్వకంగా ఆమె నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అదేవిధంగా తనకు హెలికాప్టర్ సమకూర్చడం లేదని, అందుకనే రైలు లేదా కారులలో వెడుతున్నానని అంటూ కూడా కొన్ని సందర్భాల్లో మీడియా ముందు వాపోయారు. ఒకటి హెలికాప్టర్ సదుపాయం ప్రభుత్వంతో ఏర్పర్చుకొనే సంబంధాలను బట్టి సమకూర్చే అవకాశం ఉంటుంది. లేదా రాజ్యాంగపర విధుల నిర్వహణకు అడిగినా అర్థం చేసుకోవచ్చు. కానీ తీర్థయాత్రలకు హెలికాఫ్టర్ ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా ఆమె ఒక విధంగా గవర్నర్ హోదాను కించపరిచినట్లవుతుంది.