తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా చిరస్థాయిగా తన కీర్తిని నిలబెట్టుకున్న నందమూరి తారకరామారావుకు ఆమె కూతురు! రాష్ట్రంలో మంత్రి పదవిని కూడా నిర్వహించిన సీనియర్ నాయకుడికి భార్య! అన్నిటినీ మించి తాను స్వయంగా రెండు దఫాలు కేంద్రప్రభుత్వంలో మంత్రి! అలాంటి సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి ‘వాట్ టూ డూ.. వాట్ నాట్ టూ డూ..’ అనే విషయాలు తెలియకుండా ఉంటాయా? చిన్నమ్మ మరీ అంత అమాయకురాలా? మరొకరు సలహాలు చెబితే తప్ప నిర్ణయాలు తీసుకోలేని, విధానాలు రూపొందించుకోలేని స్థితిలో ఆమె ఉన్నదా? పైపెచ్చు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఉచిత సలహాలను ఆమె కోరుకుంటున్నదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే- బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకుని.. పురంధేశ్వరి ఏం చేయాలో సాక్షి దినపత్రిక ఆమెకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. వదినమ్మ- మరిది చంద్రబాబునాయుడికి మొట్టికాయలు వేయడం మీదనే దృష్టి పెట్టాలని, ఆమెను బిజెపి హైకమాండ్ ఆ స్థానంలో నియమించినది.. వైఎస్సార్ కాంగ్రెస్ మీద విమర్శలు చేయడానికి కాదని సాక్షి దినపత్రిక గొంతెత్తి అరుస్తోంది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథ్యం స్వీకరించిన తర్వాత.. దగ్గుబాటి పురందేశ్వరి తన విధానం ఏమిటో చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. ‘‘స్వర్ణాంధ్రను చూడాలని రాష్ట్ర ప్రజలు కలలు గంటున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని ‘విధ్వంసాంధ్ర’గా మార్చేశారని’’ పురందేశ్వరి నిప్పులు చెరుగుతున్నారు. స్వర్ణాంధ్ర అనే పదమే చంద్రబాబునాయుడు కలలకు ప్రతీక అనే సంగతి అందరికీ తెలిసినదే. స్వర్ణాంధ్ర ను చూడాలనుకుంటున్న ప్రజలు అని చెప్పడం ద్వారా.. పురందేశ్వరి చంద్రబాబు విధానాలకు అనుకూలంగా ఉన్నారని ప్రజలకు అర్థమవుతోంది.
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ.. ఆమె కుటుంబం అంటే భర్త, కొడుకు ఆ పార్టీలో మాత్రం లేరు. వారు గత ఎన్నికల సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పరుచూరు నుంచి పురందేశ్వరి కొడుకు ఎమ్మెల్యేగా పోటీచేయడానికి అంతా సిద్ధం చేసుకున్న తరువాత.. ఎన్నారై కావడం వలన సాంకేతిక ఇబ్బందులు రావడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీచేశారు. ఆయన దారుణంగా ఓడిపోయారు కూడా. అప్పటినుంచి వైసీపీ పార్టీ ఆయనను పట్టించుకోకుండా పక్కన పెట్టింది. కొంతకాలం కిందట ఆయన పార్టీకి రాజీనామా చేశారు కూడా..! ఆ రకంగా తన భర్తను అవమానించిన పార్టీని పురందేశ్వరి నెత్తిన పెట్టుకుంటుందని, సోమువీర్రాజు తరహాలో వైసీపీ అనుకూల నర్మగర్భ వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకోవడం భ్రమ.
మరిదినే తిట్టాలి తప్ప.. వైసీపీని తిట్టడానికి ఆమెకు పదవి ఇవ్వలేదని సాక్షి రాతల రూపంలో జగన్ కోటరీ ఆమెకు ఎన్ని పాఠాలు అయినా చెప్పవచ్చు గాకీ.. కానీ వాస్తవంలో.. పురందేశ్వరి జగన్ వ్యతిరేక ఎజెండాతో మడమ తిప్పని పోరాటమే సాగిస్తుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
పురందేశ్వరికి పాఠాలు చెబుతున్న జగన్ కోటరీ!
Friday, November 22, 2024