ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ క్షేమంగా వర్ధిల్లాలంటే, నిజాయితీగా ఫలితాలను రాబట్టాలంటే.. ఓటర్ల జాబితాలు అనేవి చాలా కీలకమైనవి. ఓటర్ల జాబితాలను పరిపూర్ణంగా సంస్కరించి.. ఒక్క దొంగఓటు కూడా లేకుండా చేయగలిగిన నాడు.. ఈ దేశంలో ఖచ్చితంగా మంచి పాలకులే ఎన్నికవుతారు. నిజమైన ప్రజాభిప్రాయానికి విలువ దక్కుతుంది. కానీ.. ఆ పని అంత ఈజీ కాదు. ఓటర్ల జాబితాలనే బ్రహ్మాస్త్ర్రాలుగా వాడుకుని తమకు అనుకూలంగా ఉండేలా వేలాది దొంగఓట్లను నమోదు చేయించడం, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి అసలు ఓట్లు కూడా గల్లంతయ్యేలా చూడడం అనేది పార్టీలకు ఒక టెక్నిక్ గా మారింది. ఇప్పుడు కేంద్రఎన్నికల సంఘం ఏపీలో బహుధా వివాదాస్పదం అవుతున్న ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదు తదితర వ్యవహారాలపై చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల జాబితాలను సంస్కరించడానికి నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించబోతోంది. పూర్తి స్థాయిలో జాబితాల సంస్కరణ జరిగితే గనుక.. ఈ కుట్రదారులకు దబిడిదిబిడే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవైపు సాక్షాత్తూ ముఖ్యమంత్రి పరోక్షంలో అంతటి కీలకమైన ప్రకటనలు చేస్తూ ఉండే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. మన రాష్ట్రంలు 68 లక్షల పైచిలుకు దొంగఓట్లు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని దొంగఓట్లు ఉన్నయో ఆధారాల సహా చూపిస్తున్నారు. ఒకే ఇంటి నెంబరులో వందల ఓట్లు నమోదు అయిన దృష్టాంతాలను కూడా బయటకు తెస్తున్నారు. సో, ప్రతిపక్షం మాట్లాడినా, అధికార పక్షం మాట్లాడినా.. దొంగఓట్లు ఉన్నాయనేది సార్వజనీనమైన సత్యంగా తేలుతోంది.
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అయిదో క్లాసు చదివిన వాళ్లు కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా నమోదు అయి, క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేసిన వైనం రాష్ట్రం మొత్తం గమనించింది. ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ వార్తలతో భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు.. రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఢిల్లీ వెళ్లీ ఈసీ పెద్దలతో భేటీ అయ్యారు.
పర్యవసానంగా ఈ నెల 21 నుంచి దొంగఓట్లను గుర్తించడానికి ఇంటింటి తనిఖీలు నిర్వహించబోతున్నారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహించే ఈ తనిఖీల్లో పార్టీల తరఫు ఏజంట్లు కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల ఎన్నికల జాబితాలు చాలా వరకు ప్రక్షాళన అయ్యే అవకాశం ఉన్నది. ఓటింగ్ సరళిలో కొంత నిజాయితీ పెరుగుతుంది. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయిదో క్లాసు చదవని వారిని కూడా ఓటర్లుగా ప్రవేశపెట్టి లబ్ధి పొందాలని అనుకున్న వారు, అదే తరహా టెక్నిక్కులను ఉపయోగించి.. సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాయ చేయాలని కుట్రలకు పాల్పడితే చెల్లుబాటు కాదని తేలుతోంది.