`ఉచిత విద్యుత్’ వాఖ్యలతో రేవంత్ రెడ్డిపై ముప్పేట దాడి!

Thursday, December 19, 2024

`ఉచిత విద్యుత్’ వ్యాఖ్యలతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లయింది. సీఎం కేసీఆర్ పై మాటలదాడితో తెలంగాణాలో ప్రతిపక్షంలో ఓ స్టార్ గా వెలిగిపోతున్న ఆయనపై అదనుచూసి పార్టీలోని ప్రత్యర్థులతో పాటు బిఆర్ఎస్ నేతలు సహితం ముప్పేట దాడి ప్రారంభించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ రద్దు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రజలను హెచ్చరించడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అవకాశం దొరికిందని విమర్శలు మొదలెట్టారు. దేశంలో ఉచిత విద్యుత్ స్కీమ్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, రేవంత్ రెడ్డి అలా ఎలా మాట్లాడతారని ఎదురుదాడికి దిగారు.

తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్ అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన సందర్బంగా ఉచిత పథకాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అనవసరంగా ఉచిత పథకాలు అందిస్తున్నారని, అలా అందించకూడదని చెప్పారు. కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, అలా ఇవ్వకూడదని అంటూ కేవలం రైతులకు 8 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్ తెలిపారు.

‘ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట చాలు. మూడెకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలు. అంటే రోజుకొక 8 గంటలు విద్యుత్  ఇస్తే సరిపోతుంది.’ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కేవలం విద్యుత్‌ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనే నినాదం కేసీఆర్ తీసుకొచ్చాడని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించారు.

రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో ఉచిత పథకాలు అమలు చేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలతో పాటు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌తో పాటు రైతులు, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. 

రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ మండిపడుతోంది. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే.. రేవంత్‌కు జరిగే నష్టమేంటి? అని ప్రశ్నిస్తున్నారు.  ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ పార్టీది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని గుర్తు చేశారు. 

ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టుకుందని పేర్కొంటూ కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.  బుధవారం  ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించారు.

రేవంత్ రెడ్డి చేసిన అడ్డ‌గోలు మాట‌ల‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని నిప్పులు చెరిగారు.

పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలని, రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని హ‌రీశ్‌రావు రైతుల‌కు సూచించారు.

గతంలో వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నాడని, ఆయన వారసత్వాన్ని రేవంత్‌ రెడ్డి కొనసాగిస్తున్నాడని పేర్కొంటూ తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్‌ నేతలు శత్రువులని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు తెలంగాణలో మిగిలే ఉన్నాయని రేవంత్‌ వ్యాఖ్యలతో తేలిపోయిందని చెప్పారు. 2004 పరిస్థితులను 20 ఏండ్ల తర్వాత గుర్తుకుతెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటులేదన్నారుని మరోవంక పలువురు కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి తప్పుచేశారని తేల్చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో అన్నారో తెలియదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10 గంటలు కూడా విద్యుత్ ఇవ్వట్లేదని, తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని,  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక్కరే పార్టీలో నిర్ణయం తీసుకోలేరని, అంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు.

అయితే, రైతులకు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని తెలిపారు. మంత్రులు ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారని పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై రేవంత్ రెడ్డి మాట్లాడితే దానిని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా?అని సవాల్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles