సత్వరం పరిపాలనను అమరావతి నుండి విశాఖపట్టణంకు మార్చి తన పంతం నెగ్గించుకోవాలని ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన పిటీషన్ల విచారణను కనీసం సత్వరం చేపట్టాలని ఏపీ ప్రభుత్వ వాదనను సహితం కొట్టిపారేసింది.
అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వెల్లడించింది. కేసులను ఎప్పటి నుంచి విచారిస్తామనేది డిసెంబర్‌లో తేదీని నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది
సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని భావించిన ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆశలపై ఈ వాయిదాతో నీళ్లు చల్లినట్టు అయింది. ఏపీ ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య తరపున దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రాజధాని కేసును డిసెంబర్ కు వాయిదా వేయడంతో అమరావతి రైతులు సహితం అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కోర్టు వివాదాలను పరిష్కరించుకుని విశాఖపట్నం తరలి వెళ్లాలని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కేసులు కొలిక్కి వస్తాయని భావించారు.తొలుత జులై చివరి నాటికి విశాఖ వెళ్లాలని జగన్ భావించినా, అన్ని సమస్యలు పరిష్కరించుకుని సెప్టెంబర్‌లో విశాఖలో అడుగు పెట్టాలని భావించారు.
కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. అయితే, నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని, డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది.
విశాఖపట్నం తరలి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఎన్నికల సమరశంఖం పూరించాలని భావించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. డిసెంబర్‌కు కేసు వాయిదా పడినా , అదే నెలలో కోర్టుకు సెలవులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 2వరకు కోర్టు వెకేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరుగుతుందనే నమ్మకం లేదు.
అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరగా ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు రిజిస్టరీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లలేదని , ఈ నేపథ్యంలో కేసును విచారించడం సబబు కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
అయితే, ఇద్దరు ప్రతివాదులు మరణించినట్లుగా తమ వద్ద నివేదిక ఉందని, వారు మినహా మిగతా వాళ్లందరికీ నోటీసులు ఇచ్చామని ఏపీ తరఫు న్యాయవాది అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వారిద్దర్నీ ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం వాటి వివరాలను ప్రత్యేకంగా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.