టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం కీలకమైన మరో మైలురాయిని అందుకుంది. విజయవంతంగా 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అంటే ఆయన పాదయాత్రలో సగం దూరం పూర్తయింది.
రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్ 153 రోజుల్లో సగటున 13.15 కి.మీ.ల చొప్పున పాదయాత్ర చేశారు.
400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ వడివడిగా అడుగులు వేస్తూ 153 రోజుల్లోనే 50 శాతం లక్ష్యాన్ని అధిగమించారు. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27న యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 153వ రోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ.ల మైలురాయిని చేరుకోనుంది.
యువగళం 2వేల కిలోమీటర్లకు చేరుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “యువతకు అండగా నిలవడం, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగడం చూసి గర్వపడుతున్నాను” అని తెలిపారు. “యువతే మన భవిష్యత్తు, అభివృద్ధికి మంచి అవకాశాలను కల్పించడం ద్వారా టీడీపీ వారి అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. లోకేష్‌కు యువగళం ప్రయాణం ఇలా ముందుకు సాగాలని గుడ్ లక్” అంటూ ట్వీట్ చేశారు.
153 రోజుల యువగళం పాదయాత్రలో లోకేష్ సుమారు 30 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాలను స్పృశిస్తూ పాదయాత్ర కొనసాగగా, 49 చోట్ల బహిరంగసభలలో యువనేత ప్రసంగించారు. వివిధ వర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
6 ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మహిళలు, యువత, ముస్లింలు, సర్పంచులు, తదితరులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. యువనేత పాదయాత్రలో వివిధవర్గాల ప్రజలనుంచి 2,895 రాతపూర్వక వినతి పత్రాలు అందాయి. 5 చోట్ల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లె ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
లోకేష్ కూడా తన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. “నేటితో యుగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకుంది. ఈ యువగళం పాదయాత్ర అంటే దూరం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ యువత కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ఓ ప్రయాణం” అని తెలిపారు. తనతో పాటుగా కలిసి ముందుకు సాగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. “మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం.. రాబోయే మైలురాయి వైపుగా సాగుతా” అంటూ ట్వీట్ చేశారు.
యువగళం పాదయాత్ర ముఖ్యంగా రాయలసీమలో చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ. పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 45 రోజులు – 577 కి.మీ.లు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23 రోజులు – 303 కి.మీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజులు – 507 కి.మీ, ఉమ్మడి కడప జిల్లాలో 16రోజులు – 200 కి.మీ మేర పాదయాత్ర చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 29 రోజులు –425 కి.మీ. మేర పాదయాత్ర పూర్తయింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు వంటి అనివార్యమైన సందర్భాల్లో మినహా విరామం లేకుండా యువగళం కొనసాగింది. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు.
మరోవైపు ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా నారా లోకేష్ పాదయాత్ర 2వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా 3 వ స్థానంలో #2000kmOfYuvaGalam హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోందని టీడీపీ తెలిపింది. నారా లోకేష్ పాదయాత్ర నేడు 2000 కి. మీ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా వేల సంఖ్యలో ట్వీట్స్ వేస్తూ యువనేత పాదయాత్ర కి సంఘీభావం తెలుపుతున్నారు.