ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కొందరు సీనియర్ బీజేపీ నేతలు గైహాజరు కావడంతో వారు వేరే పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గైరాజర్ అయినవారిలో జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి వివేక్ వెంకటస్వామిలతో పాటు మాజీ ఎమ్యెల్యే ఎ చంద్రశేఖర్ ఉన్నారు. మొన్నటి వరకు క్రియాశీలకంగా జిల్లాల పర్యటనలు కూడా చేస్తూ వస్తున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ ఉండడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఆయనకు కాంగ్రెస్, బిఆర్ఎస్ ల నుండి ఆహ్వానాలు అందాయని, అయితే ఆయన బిఆర్ఎస్ లో చేరి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బండి సంజయ్ ను రాష్త్ర అధ్యక్షునిగా మార్చబోతున్నారని వినవస్తున్నప్పటి నుండి ఆయన అసంతృప్తిగా ఉంటూ వచ్చారని తెలుస్తున్నది.
ముఖ్యంగా కొద్దీ కాలంగా బీజేపీలో అంతర్గతంగా తీవ్ర విబేధాలు తలెత్తిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కీలక పదవి వరించినప్పటి నుండి ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. ఈటెలకు పదవి కట్టబెట్టడంకు నిరసనగా గత నెల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగిన భేటీలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ఈటెలను ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించడంతో వచ్చే ఎన్నికల సందర్భంగా ఆయనతో తనకు సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. పైగా తెలంగాణాలో బిజెపి గ్రాప్ పడిపోవడంతో అనుకున్నట్టు పెద్దపల్లి నుండి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీచేసిన గెలుపొందే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో ఆ పార్టీ వైపు మొదట మొగ్గు చూపారని తెలుస్తున్నది. అయితే పాత కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు కష్టమనే ధోరణితో బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.
ఇప్పటికే బిఆర్ఎస్ లోని కీలక నాయకులతో ఆయన మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆయన పోటీచేసే నియోజకవర్గం విషయం ఇంకా తేల్చుకోలేక పోవడంతో పార్టీ మారడంలో జాప్యం జరుగుతున్నట్లు వినికిడి. ఎమ్యెల్యేగా పోటీచేయాలి అనుకొంటుండగా పెద్దపల్లి నుండి లోక్ సభకు పోటీచేయమని బిఆర్ఎస్ నేతలు వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కానీ అందుకు వివేక్ సానుకూలంగా లేరని స్పష్టం అవుతుంది. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయనకు అక్కడి నుండి గెలుస్తామనే నమ్మకం లేదని స్పష్టం అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలైన ధర్మపురి, చొప్పదండి, మానకొండూర్‌లో ఏదైతే బాగుంటుంది, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయి అని వివేక్ స్వయంగా సర్వే చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ధర్మపురి నుండి పోటీ చేయాలి అనుకుంటే అక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ ను కాదని వివేక్ కు బిఆర్ఎస్ సీట్ ఇచ్చే అవకాశం కనబడటం లేదు. అయితే వివేక్ కు ధర్మపురి అసెంబ్లీ సీట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తే, కొప్పుల ఈశ్వర్ ను లోక్ సభకు పెద్దపల్లి నుండి నిలబెట్టే అవకాశం ఉంటుంది.