తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరు కీలక నాయకులను హై కమాండ్ ఏకకాలంలో తొలగించి సంచలనం సృష్టించింది. వారి స్థానాలలో కొత్త నాయకుల నియామకం కూడా తక్షణమే జరిగిపోయింది. ఇన్నాళ్లు సారథ్యం వహించిన వారు ఒక్కసారిగా పదవిని కోల్పోయాక అసంతృప్తికి గురయ్యే అవకాశం మెండుగా ఉంటుంది. అయితే వీరికి కంటి తుడుపు చర్యలు అన్నట్టుగా పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ వీర్రాజు ఇన్నాళ్లపాటు పార్టీకి చేసిన సేవలకు ప్రత్యుపకారం ఏమీ లేకపోయినా పరవాలేదు అనే అభిప్రాయం హై కమాండ్ లో ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి సేవలోనే తరిస్తున్న కమల నేత అనే అభిప్రాయం పలువురికి ఉంది. ఆయన విషయం పక్కన పెడితే.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చిన కీలక నాయకులు బండి సంజయ్ ను కూడా పక్కన పెట్టడం చిత్రమైన వ్యవహారం గా కనిపిస్తుంది. కుల సమీకరణాల పరంగానే కిషన్ రెడ్డి ని పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి ఉండవచ్చు గాని.. ఇన్నాళ్లు సేవలందించిన బండి సంజయ్ కు కనీసం కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తారు అని అందరూ ఆశించారు.
అలాంటి ప్రతిపాదన ఉన్నట్లుగా కనిపించడం లేదు. బండి సంజయ్, సోము వీర్రాజు ఇద్దరు నాయకులను ఒకే గాటన కట్టేసి ఆ ఇద్దరికీ భాజపా హై కమాండ్ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. ఇది కేవలం ఆయా నాయకులకు కంటి తుడుపు వైఖరి మాత్రమే అని అందరూ అనుకుంటున్నారు.
ఈ నియామకాలతో అసలు బిజెపి జాతీయ కార్యవర్గం అనే హోదాకే విలువలేకుండా పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర చీఫ్ పదవులు వెలగబెట్టిన వారు, మాజీలు అయిన తర్వాత.. రాజకీయ పునరావాసం కోసం ఏర్పాటుచేసిన కమిటీలాగా అది కనిపిస్తుంది. చివరికి అలకపూనిన కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వారికి కూడా ఆ పదవులు దక్కుతున్నాయి. ఇవాళూడా పదిమందికి చోటు కల్పించే ప్రక్రియలో జాతీయ కార్యవర్గం పట్ల ఉండే ఇష్టం ప్రజల్లో సన్నగిల్లిపోతోంది.