జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. పార్టీ శ్రేణులను కూడా సంసిద్ధం చేస్తున్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో వారాహి యాత్రకు సంబంధించిన నిర్వహణ కమిటీలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రెండో విడత యాత్రను కూడా అద్భుతంగా విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిమీద ఉన్నదని ఆయన వారికి పథనిర్దేశం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అనేది గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం అవుతుందని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.
వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెగ్గకుండా చూడాలనే కృతనిశ్చయంతో, అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్ష పార్టీలు అన్నింటినీ ఒక్కతాటి మీదకి తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో తన వారాహి యాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఉభయగోదావరి జిల్లాలకు కలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని చాలా పెద్ద సవాలు విసిరారు. ప్రత్యేకించి గత ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో కూడా.. రాబోయే ఎన్నికల్లో రెండు గోదావరి జిల్లాల్లోనూ ఆ పార్టీకి క్లీన్ షేవ్ చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించడం ఆసక్తికరమైన సవాలుగా మారింది.
ఈ సవాలును నిలబెట్టుకోవడంపై మరింత పట్టుదలగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.. తన రెండో విడత వారాహి యాత్రను కూడా గోదావరి జిల్లాలోని నిర్వహించబోతున్నారు. ఏలూరులో బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. ఉభయగోదావరి జిల్లాలో మొదటి విడతలో మిస్సయిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను రెండో విడత యాత్రలో కవర్ చేయాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలనే అంశాన్ని నిర్ధారించగలిగే స్థాయిలో అతి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉభయగోదావరి జిల్లాలపై జనసేనాని ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ రెండు జిల్లాల్లో వైసిపిని కచ్చితంగా ఓడించగలిగితే చాలు, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అనే నిశ్చితాభిప్రాయంతో పవన్ ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.