కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఎంత దూరం ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా అంతే దూరం ఉంది. ఈ సమయంలో ప్రధాన నరేంద్ర మోడీ చాలా కీలకమైన వ్యూహరచనతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పూనుకుంటున్నారు. అసమర్థులుగా, నిష్క్రియాపరులుగా తేలినటువంటి మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు. అలాగే పార్టీలో సీనియర్లకు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కూడా భావిస్తున్నారు. కేబినెట్ కు కొత్తరూపు తీసుకురావడం ద్వారా.. ప్రజల్లో నిష్కళంక ఇమేజితో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని తలపోస్తున్నారు. అయితే మోడీ బాటలోనే.. జగన్మోహన్ రెడ్డి కూడా కేబినెట్ మార్పు గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన సమయంలోనే.. రెండున్నరేళ్ల తర్వాత.. సరిగా పనిచేయని మంత్రులందరినీ మారుస్తానని ముందే ప్రకటించారు. ఆ మాట ప్రకారం సగం పాలనకాలం పూర్తయిన తర్వాత.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరించారు. అయితే.. పూర్తి కేబినెట్ ను మారుస్తానని తొలుత ప్రకటించిన జగన్, రకరకాల ఒత్తిళ్లకు లొంగి కొందరు మంత్రులను మాత్రమే మార్చారు. అయితే ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో సమర్థులైన మంత్రులుగా, కార్యశీలురుగా పేరు తెచ్చుకున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. చాలా మంది మంత్రులు.. ఆ స్థాయికి తగని వ్యక్తులు, అనేక రకాల అవినీతి ఆరోపణలతో భ్రష్టుపట్టిపోయిన వారు ఉన్నారు. వారి అవినీతి బాగోతాలతో పార్టీ పరువును పూర్తిగా బజార్న పడేసిన వారు కూడా అనేకమంది ఉన్నారు. అయితే రకరకాల కారణాల వల్ల జగన్ సర్కారు వారి మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా ఉపేక్ష ధోరణి పాటిస్తూ వస్తోంది. మంత్రుల అవినీతిని విపక్షాలు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నప్పటికీ.. వారి మీద చర్య తీసుకోవడం వలన, విపక్షాల మాటకు విలువ ఇచ్చినట్టు అవుతుందని జగన్ ఈగోకు పోతున్నారు. అయితే వారి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల పార్టీ పరువు పోతోందనే సంగతి ఆయన గుర్తించడం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. ప్రధాని మోడీ స్ఫూర్తితో.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో పదినెలల దూరంగా ఉండగా.. ఇప్పుడు మరోసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి జగన్ ఆలోచిస్తున్నట్టుగా తాడేపల్లి వర్గాలద్వారా తెలుస్తోంది. అవినీతిపరులు అసమర్థులుగా ముద్రపడిన మంత్రులను తొలగించడం వలన.. ఎలాంటి పరిణామాలు ఉంటాయి. పార్టీ ఏం ఇబ్బందులు వస్తాయి.. అనేదిశగా ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో కూడా కేబినెట్ మార్పు అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు,.