చంద్రబాబునాయుడు ముసలితనం ప్రస్తావన తేకుండా ఆయనను విమర్శించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. నిజానికి రాజకీయాల్లో ఇది అనైతికమైన పోకడ. కానీ అలాంటి పట్టింపులు జగన్మోహన్ రెడ్డికి ఉండవు గాక ఉండవు. అందుకే ప్రతిసారీ ఆ ముసలాయన అంటూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా చిత్తూరు డెయిరీని అమూల్ పరం చేసే కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి ఇలాగే మాట్లాడారు.
నిజానికి చిత్తూరులో ప్రభుత్వ రంగంలోని చిత్తూరు డెయిరీ అనేది చంద్రబాబు హయాంలోనే మూతపడింది. అదే సమయంలో చంద్రబాబునాయుడు సొంత వ్యాపారం అయిన హెరిటేజ్ డెయిరీ సమృద్ధిగా లాభాలతో వర్ధిల్లింది. ఈ రెండింటికీ ముడిపెట్టి రాజకీయంగా కావలిస్తే బోలెడన్ని విమర్శలు చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అలాంటి పని కూడా చేశారు. చంద్రబాబునాయుడే కుట్రపూరితంగా ఆ డెయిరీని మూసేయించారని అన్నారు. అయితే.. అక్కడితో ఆపి ఉంటే.. ఆ విమర్శలకు కూడా ఒక విలువ ఉండేది. ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి తన రొటీన్ విమర్శల్లోకి వచ్చారు. చంద్రబాబు ముసలితనం గురించి మాట్లాడి.. మొత్తం ప్రసంగాన్ని పలుచన చేసేశారు.
ఉండవిల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న అద్దె ఇంటిని అక్రమంగా నిర్మించారంటూ.. జప్తు చేయడానికి ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో చంద్రబాబునాయుడుకు నివాసం లేకుండా చేశాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తున్నదని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. తన సంకుచితత్వాన్ని బయటపెట్టుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. చిత్తూరు డెయిరీ సభలోనే ఆయన మాట్లాడుతూ.. 75 ఏళ్ల ఈ ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని అంటూ డ్రామాలు చేస్తున్నారు అని జగన్ ఎద్దేవా చేశారు. కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు అడిగారు. ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోంది. అయితే ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నం డ్రామా అని జగన్ ఎలా చెప్పగలరు? అనేది ప్రజల ప్రశ్న. ఆయనకు చంద్రబాబు డ్రామాలాడుతున్నట్టుగా నిరూపించాలనే కోరిక ఉంటే.. ఎంచక్కా అనుమతులు ఇచ్చేస్తే తేలిపోతుంది కదా.. చంద్రబాబు కట్టుకుంటారో లేదో అర్థమవుతుంది కదా.. అప్పుడు ఇంకా స్ట్రాంగుగా విమర్శించవచ్చు కదా అని ప్రజలు అంటున్నారు. అయినా జగన్ కు వాస్తవమైన విమర్శలు చేయాలనే నియమం ఉండదని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. 75 ఏళ్ల వయసున్నంత మాత్రాన ఇల్లు కట్టుకోకూడదా? అని కూడా ప్రజలు అడుగుతున్నారు. నిజానికి చంద్రబాబు మాటలు డ్రామాలో కాదో ప్రజల ఎదుట తేల్చడానికి , కుప్పంలో ఇంటికి అనుమతులు ఇవ్వకపోవడం ద్వారా.. జగన్ ఒక అవకాశాన్ని కోల్పోయినట్టే.