జనసేనాని పవన్ కల్యాణ్ తన తొలివిడత వారాహి విజయ యాత్రను పూర్తిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ మీద యుద్ధానికి తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ సాగడానికి వారాహి యాత్ర 2 ను కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నారు. అయితే చాలా మంది అంచనా వేసినట్లుగా.. వారాహి యాత్ర రెండో విడత మరో ప్రాంతం నుంచి కాకుండా.. మళ్లీ గోదావరి జిల్లాల్లోనే సాగించాలని, మిగిలిపోయిన అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
వారాహి వాహనం తయారీలో ఉండగా.. పవన్ బస్సు యాత్ర సాగిస్తారనే ప్రకటనలు వచ్చాయి. తొలుత ఆయన తిరుపతి నుంచి తన యాత్ర ప్రారంభిస్తారని అప్పట్లో ప్రకటించారు. కానీ.. రకరకాల కారణాల వల్ల.. పవన్ వారాహి యాత్ర అనేది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గత నెలలో ఉభయగోదావరి జిల్లాల్లో జరిగింది. ఈ రెండు జిల్లాల్లో పవన్ కల్యాణ్ సభ పెట్టిన ప్రతిచోట కూడా.. తమ పార్టీ అనుకున్న దానికంటె చాలా ఎక్కువగా ప్రజల స్పందన వచ్చిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉన్నట్టుగా వారికి తేలింది. ప్రజల్లో ఉన్న ఆదరణను మరింతగా క్యాష్ చేసుకోవాలంటే.. ఆ జిల్లాల్లో తొ లుత వారాహి యాత్ర ప్రారంభించడమే సబబు అనే వ్యూహంతో అక్కడ మొదలెట్టారు. కొన్ని నియోజకవర్గాలు మిగిలిపోయాయి. ప్రస్తుతానికి యాత్ర ఆగినప్పటికీ.. దానిని కేవలం విరామంగానే పరిగణించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం కొన్ని రోజుల వ్యవదిలోనే వారాహి రెండో విడత యాత్రను మళ్లీ గోదావరి జిల్లాల్లోనే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ భీషణ ప్రతిజ్ఞచేశారు. ఆ రెండు జిల్లాల్లో గత 2019 ఎన్నికల్లో వెస్ట్ గోదావరి జిల్లా ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది.. ఈ సారి రెండు జిల్లాల్లోనూ ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని సవాలు చేయడం అంటే పవన్ చాలా పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నట్టు లెక్క. అయితే.. తన సవాలును నిలబెట్టుకోవడానికే.. పవన్ కల్యాణ్ ఆ రెండు జిల్లాల్లో ఒక్క నియోజకవర్గం కూడా విడిచిపెట్టకుండా అన్నిచోట్లా పర్యటించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పార్టీకి సానుకూలత ఉన్న ప్రాంతాల్లో మరింత గట్టి ఫోకస్ పెట్టే ప్రయత్నంలోనే జనసేన దూసుకువెళుతోంది.
‘వారాహి యాత్ర 2’ ఫోకస్ కూడా గోదావరి మీదనే!
Saturday, December 21, 2024