వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి సవాలు విసిరారు. ఈ దేశంలో మతమార్పిడులు జరుగుతున్నాయని వ్యతిరేకించే, ఘోషించే అధికారం మీకు ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశ ప్రజలకు మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించిందని, ఏ మతాన్ని ఆచరించాలి అనేది వ్యక్తికి, మనసుకు సంబంధించిన విషయమని వాళ్ల ఇష్టాలను మీరెలా తప్పు పట్టగలరు అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మీకు అంతగా మతమార్పిడుల మీద వ్యతిరేకత ఉంటే.. కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే గనుక.. ఈ దేశంలో మతమార్పిడులకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలని, ఆమేరకు రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని.. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటిస్తే మీ మాట మీ ఇచ్చమొచ్చినట్లుగా చెల్లుబాటు అవుతుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సవాలు విసిరారు.
మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణం అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. క్రిస్టియన్లకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఘాటైన సవాలు విసరడం ఈ ఎపిసోడ్లో తాజా పరిణామం.
క్రిస్టియన్లు మాత్రమే బాప్టిజం తీసుకుంటారని, అలా తమ క్రిస్టియన్లు బాప్టిజం స్వీకరించడానికి ఒక ఘాట్ అవసరమని ఆ మతానికి చెందినవారు కోరడంతో తాను పూనుకొని వారికి స్థలం ఇప్పించినట్లుగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. బాప్టిజం స్వీకరించడం అంటే మతమార్పిడి అనే అర్థం రాదని ఆయన సమర్థిస్తున్నారు. బాప్టిజం ఘాట్ నిర్మాణం జరుగుతుండగా భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి అడ్డుకోవడం గొడవ చేయడాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నారు.
మొత్తానికి మంగళగిరిలో బాప్టిజం ఘాట్ వ్యవహారం అనేది పార్టీల మధ్య వివాదంగా ముదిరి పాకాన పడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మీకు చేతనైతే మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తీసుకురండి గాని దేశంలో మతమార్పిడులను వ్యతిరేకించే హక్కు మీకు లేదు అని డైరెక్ట్ గా సవాలు విసరడం అనేది చాలా కీలకమైన పరిణామం అని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపి సంబంధాలు పలచబడుతున్న సమయంలో ఆళ్ల వ్యాఖ్యలు కీలకం అవుతున్నాయి.