మహారాష్ట్రలో ఎన్సీపీలో చీలిక తేవడంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సహితం ఇతర పార్టీలను ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్న బిజెపి కేంద్ర నాయకత్వానికి తెలంగాణాలో సొంత పార్టీలో రచ్చకెక్కుతున్న కుమ్ములాటలు గురించి పట్టించుకునే తీరిక కనబడటం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్న పార్టీ నేతలను దున్నపోతులతో పోలుస్తూ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఒక వంక ట్వీట్ చేస్తే, మరోవంక బండి సంజయపై పార్టీ ఎమ్యెల్యే రఘునందన్ రావు ఇంతెత్తున ఎగిరిపడ్డారు.
పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్ వందల కోట్ల రూపాయలతో తన ఇమేజ్ పెంచుకునేందుకు మీడియాలో ప్రకటనలు ఏవిధంగా ఇస్తున్నారంటూ ప్రశ్నించడం ద్వారా పార్టీలో సంజయ్ సాగిస్తున్న అరాచకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ కారణంగా తెలంగాణాలో బిజెపి గ్రాఫ్ పెరిగిన్నట్లు ఆయన భజనపరులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు
మునుగోడు ఉపఎన్నికలో వంద కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ గెలవలేదని గుర్తు చేశారు. తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో తెలంగాణలో ఓట్లు పడవని తేల్చిచెప్పారు. రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తన నియోజకవర్గం దుబ్బాకలో అంతకు ముందు బిజెపికి 3,000 ఓట్లు మాత్రమే వచ్చాయని చెబుతూ దుబ్బాకలో గాని, హుజురాబాద్ లో గాని అభ్యర్థుల పలుకుబడితో గెలిచాం గాని బిజెపి బలంతో కాదని పరోక్షంగా స్పష్టం చేశారు.
అంటే పేస్ వేల్యూ లేని వారు బిజెపికి నాయకత్వం వహిస్తుంటే తెలంగాణాలో ఆ పార్టీ ఏవిధంగా ముందుకు వెడుతుందంటూ ప్రశ్నలు కురిపించారు. అయితే, ఈ ఘాటైన విమర్శలు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఇంటి వద్దనే చేయడం గమనార్హం. ఆ తర్వాత తనపైకి వస్తుందని కిషన్ రెడ్డి భయపడటం వల్లనో, మరో కారణం చేతనో ఆబ్బె తాను అలా అనలేదని, ఏదో సరదాకు అన్నానంటూ గంట సేపటికే స్వరం మార్చారు.
ఏదేమైనా తెలంగాణాలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానంపై వస్తున్న వత్తిడుల వెనుక కిషన్ రెడ్డి ఉన్నట్లు బలమైన అనుమానాలు ఇప్పుడు అందరికి కలుగుతున్నాయి. బండి సంజయ్ పనితీరును తన ముందే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారు మెచ్చుకొంటుండటం, అతనితోనే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో కిషన్ రెడ్డి లోలోపలనే ఇప్పటివరకు రగిలి పోతున్నారు.
వాస్తవానికి ఈటెల రాజేందర్ ను బిజెపిలోకి రాకుండా బండి సంజయ్ తొలుత తీవ్రంగా ప్రతిఘటించారు. రాజేందర్ కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన నేత కావడం, జనంలో మంచి పలుకుబడి గల నేత కావడంతో ఇక తనకు విలువ ఉండబోదని భయపడ్డారు. పైగా, అప్పుడే ఆయనను రాష్ట్ర అధ్యక్షునిగా చేయాలనే వాదనలు ఆర్ఎస్ఎస్ వర్గాల నుండి కూడా వచ్చాయి.
సహజంగా ఇతర పార్టీల నుండి సీనియర్ నేతలు ఎవ్వరు చేరాలి అనుకున్నా ఏదో ఒక సాకుతో నిరుత్సాహ పరిచే కిషన్ రెడ్డి ఇక్కడ సంజయ్ కు వ్యతిరేకంగా రాజేందర్ ను ప్రోత్సహించారు. నేరుగా అమిత్ షా వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేరేటట్లు చేశారు.