ఏపీపై జగన్ లక్ష్యంగా రాహుల్ గాంధీ వ్యూహాలు

Friday, November 22, 2024

ఖమ్మంలో ఆదివారం రాత్రి జరిగిన తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్న ఆయన అనంతరం తిరిగి వెడుతూ గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో చర్చించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ ఉనికి కాపాడుకొనే వ్యూహాల గురించి ఓ నిర్ధారణకు వచ్చిన్నల్టు తెలుస్తున్నది.

వై ఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే, ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పజెప్పి, ఆమె ద్వారా ఏపీలో చొచ్చుకు పోవాలని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే తాను తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతానని, ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయంగా బైటకు రాలేనని స్పష్టం చేయడంతో ఏపీలో మరో వ్యూహం అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో వైసిపి, టిడిపి, జనసేన ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపిల మనుగడ ప్రశ్నార్ధకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో  ఆయా పార్టీలు చేపట్టలేని అంశాలను చేపట్టడం ద్వారా కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకోవాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తున్నది. ఆ మూడు పార్టీలు కూడా కేంద్రంలోని బిజెపికి బి- టీం గా వ్యవహరిస్తూ ఉండడంతో, ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తక పోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం, అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తూ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయకపోవడం గురించి ప్రజలను సమీకరించాలని ఆయన రాష్ర పార్టీ నేతలకు సూచించారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమని చెబుతూ అమరావతికే కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రియాంకగాంధీ త్వరలోనే పర్యటించి ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతారని చెప్పారు. ఏపీలో జరుగుతున్న పరిణామలన్నీ తనకు తెలుసని పేర్కొంటూ  కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

తాను స్వయంగా విశాఖపట్నం వచ్చి, విశాఖ ఉక్కు కోసం ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతానని రాహుల్ చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు తెలిపేందుకు వచ్చే నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న సభలో రాహుల్ పాల్గొంటారని  పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు మీడియాకు తెలిపారు.

అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ గురించి కూడా రాహుల్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజులలో ఈ కేసులను అడ్డం పెట్టుకొని జగన్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓ ఆట ఆడిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉంది.

ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ గెలుపొందే సీట్లు లేకపోయినా, కాంగ్రెస్ తో కలిసి వచ్చే పార్టీ అంటూ లేకపోయినా జాతీయ స్థాయిలో బిజెపికి వైతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జతకట్టడం కలసి వస్తుందని రాహుల్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles