‘ఏ-8’ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ యాత్ర??

Thursday, January 2, 2025

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ  వెళుతున్నారు. కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పుడు ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 5వ తేదీన జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. అదేరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. హోం మంత్రి అమిత్ షా తో కూడా భేటీ కావలసి ఉన్నప్పటికీ, ఆయన అపాయింట్మెంట్ ఎప్పటికి దొరుకుతుంది అనేదాన్ని బట్టి అదే రోజు లేదా ఆరవ తేదీ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. హఠాత్తుగా ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం గనుక అసలు కారణాలు ఏమై ఉండవచ్చుననే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే. జూన్ 30వ తేదీలోగా దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. సిబిఐ తమ ఛార్జ్ షీట్లను ఆరోజు దాఖలు చేసింది. అయితే అక్కడితో దర్యాప్తు మొత్తం సాంతం పూర్తి అయిపోయినట్లుగా కాదని, మరికొంత దర్యాప్తు కూడా అవసరం కావచ్చు అని చెబుతున్నారు. సిబిఐ తమ చార్జిషీట్ లలో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ-8గా, నిందితుడిగా చేర్చింది. ఇప్పటిదాకా ఆయనను కేవలం అనుమానం మీద విచారిస్తూ వచ్చారు. ఈ విషయంలో అవినాష్ రెడ్డి న్యాయవాదులు కూడా పలుమార్లు కోర్టులో ప్రస్తావిస్తూ ఆయన నిందితుడు కాకపోయినప్పటికీ వేధిస్తున్నారని ఆరోపించడం జరిగింది. ఇప్పుడు అవినాష్ ని నిందితుడుగా కూడా చేర్చారు. ఈ కేసులో ఇకపై కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

ఈ విషయం మీదనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ ప్రధానంగా దృష్టి పెడుతుందని పలువురి అభిప్రాయం. అవినాష్ రెడ్డిని పూర్తిగా వివేకా హత్య కేసు ఉచ్చులో నుంచి పక్కకు తప్పించడమే జగన్ ఆశయమని పేర్కొంటున్నారు.

ఎటొచ్చీ ఢిల్లీలోని పెద్దలను కలిసిన తర్వాత, అక్కడ మీడియాకు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం త్వరగా పూర్తి అయ్యేలా నిధుల విడుదల సకాలంలో జరగాలని.. విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని, విభజన చట్టంలోని ఆస్తుల పంపకాలను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపినట్లుగా ఆ ప్రెస్ నోట్లో వివరిస్తారు. ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్లుగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జరుగుతున్న ప్రహసనం ఇదే. తొలినాళ్లలో అయితే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరకకుండా వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం. ఇప్పుడు అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి గానీ, భేటీలో వారిని కోరుకునే కోరికలు వేరు, బయటకు వచ్చిన తర్వాత వెల్లడిస్తున్న వివరాలు వేరు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles