చోద్యం : ఇవేం కేసులు రా నాయనా..!?

Saturday, January 18, 2025

కుప్పంలో ఈసారి చంద్రబాబునాయుడును ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. టీడీపీకి అక్కడ ఉన్న బలం చూసి కంగారు పడుతున్నారా? తెలుగుదేశం శ్రేణులను ఏదో ఒక రీతిగా కట్టడి చేయడం మీదనే వారి ధ్యాస మొత్తం కేంద్రీకృతం అవుతున్నదా? అందుకోసం ముందు వెనుక చూసుకోకుండా పోలీసు బలగాలను కూడా అడ్డగోలుగా వాడుకుంటున్నారా? లాంటి అనుమానాలు అనేకం కలుగుతున్నాయి.. ఇప్పుడు పరిస్థితుల్ని గమనిస్తోంటే!

నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటి. గతంలో ఉద్యమాలు, పోరాటాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నించినప్పుడు.. కోర్టులు చాలా స్పష్టంగా ఈ సంగతి వెల్లడించాయి. నిరసన తెలియజేయడం అనేది ప్రజల హక్కు అని తేల్చి చెప్పాయి. అయితే ఏపీలో పోలీసుల తీరు గమనించినప్పుడు.. నిరసనలు వెలిబుచ్చినా సరే.. కటకటాలు తప్పవని హూంకరిస్తున్నట్టుగా ఉంది. పోలీసులు కేసులు పెట్టడంలో తమ నియమనిబంధనలనే అలా సవరించుకున్నారా? లేదా, చంద్రబాబునాయుడు నియోజకవర్గం గనుక, ఆయన అనుచరులు నోరు మెదిపితే చాలు కేసులు పెట్టి తాట వొలిచేయాలని ఫిక్సయ్యారా? అని ప్రజలు అనుమానిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలం ఉసినిగానిపల్లెలో చిన్న వివాదం రేకెత్తింది. మాజీ సర్పించి మహాదేవి, ఆమె భర్త జయశంకర్ లను ఎస్సై దూషించడంతో పాటు, ఎన్ కౌంటర్ చేస్తానంటూ బెదిరించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపు కూడా కోర్టు వద్దనే జరిగినట్టు చెబుతున్నారు.

ఎస్సై అంత దూకుడుగా మాట్లాడడం పట్ల నిరసనగా తెలుగుదేశం ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అది కేవలం నిరసన కార్యక్రమమే.. పోలీసు స్టేషన్ మీద దాడి గానీ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం గానీ కాదు. కానీ.. రామకుప్పం హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఏకంగా 44 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల విధినిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారనేది వీరి మీద మోపిన ఆరోపణ. వీరిలో చంద్రబాబు పీఏ మనోహర్ కూడా ఉన్నారు.

ఏపీలో ప్రతిపక్షాల పరంగా చీమ చిటుక్కుమంటే చాలు పోలీసు కేసులు నమోదు అయిపోతాయి. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినందుకు, అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు కూడా ఎంతమందిమీద కేసులుపెట్టి రాచి రంపాన పెడుతున్నారో అందరికీ తెలుసు. విపక్ష పార్టీలకు చెందిన నాయకుల మీద కేసులు, అరెస్టులు ఉధృతంగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సాధారణమైన నిరసన కార్యక్రమానికి ఏకంగా 44 మంది మీద కేసులు పెట్టడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles